యువతరం దశ మార్చే యజ్ఞానికి చంద్రబాబు  శ్రీకారం!

రాష్ట్రంలోని యువతరానికి ఉద్యోగాల కల్పన విషయంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు గట్టి హామీ ఇచ్చారు. లక్షల కొద్ది ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. యువతరం చంద్రబాబును నమ్మింది. ఐదేళ్లలో ఉద్యోగాలు కల్పన విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా రాష్ట్రాన్ని వంచించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో విసిగి వేసారి పోయి ఉన్న ఏపీ యువతరం చంద్రబాబుకు నీరాజనం పట్టింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత యువతరానికి ఉజ్వలమైన భవిష్యత్తును అందించే దిశగా తన చిత్తశుద్ధిని చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన మొదటి రోజునే నిరూపించుకున్నారు.

గెలిచిన తర్వాత మెగా డీఎస్సీ ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని ప్రకటించి, ఆ మాట నిలబెట్టుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వృద్ధులకు పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి వాటితో పాటు తొలి రోజు సంతకం చేసిన మరో అద్భుతమైన నిర్ణయం.. రాష్ట్రంలో నైపుణ్య గణన. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రయత్నం  ఇది.

రాష్ట్రంలోని నిరుద్యోగులు ఏం చదువుకున్నారు? ఏ పని చేస్తున్నారు? ప్రస్తుతం ఎంత సంపాదిస్తున్నారు? వారి నైపుణ్యాలు ఏంటి? అన్న వివరాలను ఒక ప్రత్యేకమైన యాప్ ద్వారా నమోదు చేస్తారు? ప్రస్తుతం తక్కువ ఆదాయం పొందుతున్న వారికి ఆదాయం పెరిగేలా, వారి నైపుణ్యాలను పెంచేలా, కొత్త శిక్షణలు ఇప్పిస్తారు! అలాగే అందుబాటులో ఉన్న యువతరం వద్ద ఉన్న నైపుణ్యాలు ఏమిటి? రాష్ట్రంలోని పరిశ్రమలు ఇతర రంగాలకు అవసరమైన ఉద్యోగులకు ఉండవలసిన నైపుణ్యాలు ఏమిటి? అనేవి క్రోడీకరిస్తారు. సంస్థలకు అవసరమైన నైపుణ్యాలను ఆయా రంగాలకు చెందిన యువతరానికి ప్రత్యేకంగా నేర్పి, వారు మెరుగైన ఉద్యోగాలు పొందే లాగా శిక్షణలు ఇస్తారు. ప్రతి నిరుద్యోగ యువకుడి డేటాకు ఒక శాశ్వత నెంబర్ లాగా ఆధార్ నెంబరు వంటిది కేటాయించడం గురించి కూడా ఆలోచిస్తున్నారు.

నిజానికి యువతరానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అనేది కొత్త సంగతి కాదు. దేశవ్యాప్తంగా అమలవుతూ ఉన్నదే. అయితే యువకులు వద్ద ప్రస్తుతానికి ఉన్న నైపుణ్యాలు ఏమిటి? పరిశ్రమలకు సంస్థలకు అవసరమైనవి ఏమిటో తెలుసుకుని.. రెండింటిని సమన్వయపరచి ఎక్కడైతే మెరుగైన అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాల దిశగా యువతరానికి శిక్షణలు ఇచ్చి వారిని తర్ఫీదు చేయడం చంద్రబాబు సరికొత్త ప్రణాళికలోని గొప్ప అంశం. రాష్ట్ర యువతరం దశ దిశ మార్చడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ఈ సరికొత్త ప్రయత్నం గొప్పగా విజయవంతం అవుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories