చంద్రబాబు హెచ్చరికలు ఆ ముగ్గురికి మాత్రమే కాదు!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుస్సా అయ్యారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేల మీద ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు. ఇలాంటి పనులు చేస్తే ఎంతటి వారైనా సరే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. గత కొన్ని రోజుల్లో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వివాదాస్పదం అయిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబునాయుడు సీరియస్ గా స్పందించారు. ఆ ముగ్గురికీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే చూడబోతే.. చంద్రబాబునాయుడు వార్నింగ్ కేవలం వార్తల్లో వ్యక్తులుగా నిలిచిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రమే కాదని.. మొత్తం కూటమి పార్టీల తరఫున గెలిచిన అందరు ఎమ్మెల్యేలకు వర్తిస్తుందని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా, పార్టీకి నష్టం చేసేలా ఏ ఎమ్మెల్యే లేదా ఇతర నాయకుడు వ్యవహరించినా కూడా.. ఉపేక్షించే ఉద్దేశంతో చంద్రబాబు లేరని అర్థమవుతోంది.
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆయన మీద మాత్రమే కాకుండా.. ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ల వ్యవహారంపై కూడా ఆయన సీరియస్ అయ్యారు. నాయకులు వ్యక్తిగతంగా చేసే తప్పుల వలన పార్టీకి చాలా పెద్దనష్టం జరుగుతుందని చంద్రబాబునాయుడు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా ఉన్నది గనుక.. నడుస్తున్నది గానీ.. ఇంకా చాలా మంది వ్యవహార సరళి విషయంలో అధినేత అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. కూన రవికుమార్ కేజీబీవి ప్రిన్సిపల్ సౌమ్య విషయంలో వివాదం నడుస్తోంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ వీడియో కాల్స్ వివాదాస్పదం అయ్యాయి. అనంతపురంలో జూ.ఎన్టీఆర్ ను దూషించడం చిన్న విషయం అనుకోవాలి. ఎందుకంటే అంతకంటె దారుణంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గపోరుతో పార్టీని దెబ్బతీస్తున్నారు.

వీరి వ్యవహారాలన్నీ ఒక ఎత్తు అయితే.. పార్టీ పరువు పోయేలా తమ తమ నియోజకవర్గాల్లో అవినీతికి, అరాచకాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలు ఇంకా బోలెడు మంది ఉన్నారు. వారి వ్యవహారాలు కూడా అధినేత దృష్టికి వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు వారిని పార్టీలోని సీనియర్ల ద్వారా హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే.. వారు తీరు మార్చుకోకపోతే.. కఠినంగా వ్యవహరించడానికైనా వెనుకాడకూడదని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories