నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. నారా చంద్రబాబునాయుడు గతంలోని మూడు పర్యాయాల కంటె కూడా చాలా పెద్దరికంతో, ఎంతో గౌరవప్రదంగా, హుందాతనంతో వ్యవహరిస్తున్నారనే సంగతి.. ఆయన ప్రత్యర్థులు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉందిప్పుడు! ఎన్నికల ఫలితాలు వచ్చిన క్షణం నుంచి కూడా.. చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న ప్రతి మాట, ఆయన వ్యవహరిస్తున్న తీరులో ప్రతి అడుగు.. ఆయనలోని అపరిమితమైన హుందాతనానికి ప్రతీకగానే నిలుస్తున్నాయి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తన లేకితనాన్ని నిరూపించుకున్నారు.
జగన్ తన లేకితనాన్ని శాసనసభ తొలిరోజునే, ఎమ్మెల్యేలుగా ప్రమాణాలు చేసిన రోజునే ఘనంగా నిరూపించుకున్నారు. కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీకి సారథి, కేవలం మామూలు ఎమ్మెల్యే మాత్రమే అయిన జగన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మాత్రమే ప్రమాణానికి రావాలన్నది రూలు. అయితే ‘ఈరోజు రూల్పన్నీ పక్కన పెట్టండి’ అని చంద్రబాబు హుకుం జారీచేసి మరీ.. జగన్ అసెంబ్లీలో ఒక రూము కేటాయించారు. మంత్రుల తర్వాత ఆయన ప్రమాణం ఉండేలా ప్రోటోకాల్ మర్యాద అందించారు. ఆ మర్యాదను జగన్ నిలబెట్టుకోలేకపోయారనే అంశాన్ని తెలుగుమోపో డాట్ కామ్ అప్పుడే తెలియజేసింది.
అయితే జగన్ సభా మర్యాదను, సాంప్రదాయాన్ని కూడా పాటించకుండా.. తన లేకితనాన్ని మరింత ఘనంగా చాటుకుంటున్నారు. శాసనసభాపతి ఎన్నికైన తర్వాత.. సభలో ఉన్న అన్ని పక్షాల నాయకులు కలిసి వెంటనడుస్తూ సభాపతిని అధ్యక్షస్థానం వద్దకు తీసుకువెళ్లడం సాంప్రదాయం. తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. ఆయన పట్ల మర్యాద చూపుతూ వెంటనడవడం తనకు ఇష్టం లేదన్నట్టుగా జగన్ రెండోరోజు శాసనసభకు హాజరు కానేలేదు. అసలు అమరావతినుంచే పలాయనం చిత్తగించి.. పులివెందుల టూరు పెట్టుకున్నారు. ఆయన సభకు రాకపోవడం మాత్రమే కాదు.. తన పార్టీ తరఫున గెలిచిన మిగిలిన పదిమంది కూడా సభకు వెళ్లకుండా జగన్ వారిని నియంత్రించి, తన కొద్దిబుద్ధిని చూపించారు.
నాయకుల వ్యవహార సరళి వారి వ్యక్తిత్వాన్ని కూడా ఇట్టే చూపించేస్తోందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ఎంతో హుందాగా జగన్ కు లేని గౌరవాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేశారు. తన ప్రత్యర్థి అనే సంగతిని ఎన్నికల తర్వాత మరిచిపోయినట్టుగా.. ఒక మాజీ ముఖ్యమంత్రిగా గౌరవంగా చూశారు. కానీ.. జగన్ తనకు ఏమాత్రం సహనం లేదని, ఇతరులు గెలిస్తే తాను చూసి ఓర్చుకోలేనని చెబుతున్నట్టుగా అసలు సభకు రాకుండా వెళ్లిపోయారనే విమర్శలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.