చంద్రబాబు ప్రమాణం అంటే గట్లుంటది మరి!

ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి పదవీస్వీకార ప్రమాణం చేయడానికి ముహూర్తం మరియు వేదిక రెండూ ఖరారు అయ్యాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్ కు, కేసరపల్లి ఐటీ హబ్ కు సమీపంలో ఉన్న విశాలమైన స్థలాన్ని సభావేదికగా ఎంపిక చేశారు. బుధవారం జూన్ 12న ఉదయం 11.27 గంటలకు నారా చంద్రబాబునాయుడుతో గవర్నరు ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు, ఎన్డీయే కూటమిలో భాగస్వాములు అయిన మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంత మంది వీఐపీలు వస్తుండడంతో.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అంటే.. గట్లుంటది మాతోని.. అని తెలుగుదేశం వర్గాలు పండగ చేసుకుంటున్నాయి.

ఇంతటి అపూర్వమైన ఘనవిజయం సాధించిన తర్వాత.. ముఖ్యమంత్రిగా నాలుగోసారి పదవీ ప్రమాణం చేయడం రాజభవన్ లో కాకుండా, బహిరంగసభలోనే చేయాలని చంద్రబాబునాయుడు ముందుగానే అనుకున్నారు. తొలుత 9వ తేదీ ఆదివారం చేయాలని అనుకున్నప్పటికీ.. అదే రోజు ప్రధాని ప్రమాణస్వీకారం ఉండడం, ఆ కార్యక్రమానికి ఎన్డీయే కీలక నేతలుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ హాజరు కావాల్సి ఉండడం వలన 12వ తేదీనాటికి మార్చుకున్నారు.

చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇతర రాష్ట్రాల నాయకులకు ఆహ్వానాలు వెళుతున్నాయి. కేవలం ఎన్డీయే కూటమి పార్టీల నాయకులు మాత్రమే కాకుండా.. కొన్ని ఇతర పార్టీల నాయకులు కూడా వస్తారని అంచనాలు సాగుతున్నాయి. చంద్రబాబునాయుడుకు ఎన్డీయే కూటమికి అతీతంగా జాతీయ రాజకీయాల్లో తనదైన గుర్తింపు ఉంది. అనేక ఇతర రాష్ట్రాల నాయకులు ఆయనతో సత్సంబంధాలు కలిగిఉంటారు. కాబట్టి వారు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

 ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా ప్రమాణం చేస్తుందని తెలుస్తోంది. జనసేన పార్టీకి మూడు, భారతీయ జనతా పార్టీకి రెండు  మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. కేబినెట్ లో లోకేష్ చేరే అవకాశం ఇప్పటికే ఖరారు అయింది గానీ.. పవన్ కల్యాణ్ మంత్రి పదవి తీసుకుంటారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. 

Related Posts

Comments

spot_img

Recent Stories