మేకపోతు గాంభీర్యానికి అచ్చమైన ఆనవాళ్లు లాగా.. అటు ఐప్యాక్ వారితో సమావేశంలో తాము 151 కంటె ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే.. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి.. జగన్ 9వ తేదీన విశాఖలోనే ప్రమాణస్వీకారం చేయబోతున్నట్టుగా వెల్లడించారు. విశాఖలో ప్రమాణం అనేది.. నిజానికి జగన్ విశాఖ వాసులను ఊరించడానికి ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పిన మాట. బొత్స కొత్తగా తేదీ మాత్రమే ప్రకటించారు. అయితే తెలుగుదేశం వర్గాలు ఏం ఆలోచిస్తున్నాయి? ఎన్డీయే కూటమి తప్పకుండా గెలుస్తుందనే అంచనాలున్న నేపథ్యంలో.. వారు కూడా ఇప్పటికే ముహూర్తం అన్వేషణలో ఉండాలి కదా?
పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. చంద్రబాబునాయుడు జూన్ 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడానికి బాగుంటుందని వేదపండితులు సూచించినట్టు సమాచారం.
జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఆరోజు సాయంత్రానికి ఏపీలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు వచ్చేస్తాయి. అదే రోజు సాయంత్రం కూటమిలోని మూడు పార్టీలకు చెందిన ప్రతినిధులు జట్టుగా వెళ్లి తమను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా రాష్ట్ర గవర్నరుకు లేఖ ఇచ్చే అవకాశం ఉంది. ఆవెంటనే 5వ తేదీనే ప్రమాణ స్వీకారం చేయాలని అనుకుంటున్నట్టుగా సమాచారం.
నిజానికి జూన్ 5వ తేదీ బుధవారం కృష్ణ పక్షం చతుర్దశి అవుతుంది. ఆరోజు మిస్సయితే 6వ తేదీ అమావాస్య నాడు శుభకార్యాలు చేయరు. అలాగే 7వ తేదీ పాడ్యమినాడు కూడా మంచి పనులు ప్రారంభించడం తెలుగువారికి అలవాటు లేదు. 8వ తేదీ శనివారం శుక్లపక్షం విదియ మంచి రోజు- అలాగే 9వతేదీ ఆదివారం శుక్లపక్ష తదియ కూడా మంచిదే అని వేదపండితులు సూచనలు చేసినట్టు సమాచారం. ప్రజలు తమకు అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత.. ఒక్కరోజు కూడా జగన్ ను అధికార పీఠంపై ఉంచడానికి వీల్లేదని, అందుకే 4వ తేదీ ఫలితాలు వచ్చిన వెంటనే.. 5వ తేదీనే ప్రమాణస్వీకార కార్యక్రమం పెట్టుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
వేదిక కూడా ఖరారైనట్టే. అమరావతిలో.. ఎక్కడినుంచి అయితే రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారో.. అదే ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. తద్వారా.. అమరావతి నిర్మాణానికి తమ ప్రభుత్వం పునరంకితం అవుతున్నదనే సందేశాన్ని ఇవ్వాలని ఆయన ఉత్సాహపడుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.