చంద్రబాబు చెప్పే స్ఫూర్తి కూటమికి శ్రీరామరక్ష!

ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ఐక్యత సడలకుండా ఉండడం వారికి చాలా అవసరం. ఈ సత్యాన్ని కూటమి పార్టీల నాయకులు అందరూ చాలా బాగానే గుర్తించారు. నిజం చెప్పాలంటే.. కూటమి ఐక్యత దెబ్బకు కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచి.. కుదేలైపోయి.. అసలు భవిష్యత్తు ఉంటుందో లేదో తెలియని డోలాయమాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ సత్యాన్ని బాగానే గుర్తించింది. అందుకే కూటమి పార్టీల ఐక్యతను దెబ్బతీయడానికి, వారి మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికి తమ శక్తివంచన లేకుండా కుట్రలు చేస్తున్నది. వారి కుట్రలను సరిగ్గా గుర్తించిన వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయన తన పార్టీ నాయకులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. కూటమి ఐక్యతకు భంగం కలిగించేలా ఎవ్వరు ప్రవర్తించినా ఊరుకునేది లేదని అంటున్నారు. ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే మరో పదిహేనేళ్లు స్థిరమైన పాలన అందించగలం అని, రాష్ట్ర పురోభివృద్ధికి ఇది చిలా అవసరం అని అంటున్నారు.

ఇలాంటి వాతావరణంలో తాజాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్న స్ఫూర్తిదాయకమైన మాటలు ఎన్డీయే కూటమి ఐక్యతకు శ్రీరామరక్షలా నిలుస్తాయనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. ఎన్డీయే కూటమి అంటే మూడు పార్టీలు కావొచ్చు గానీ.. ప్రత్యర్థులు వేసే నిందల విషయానికి వస్తే ముగ్గురూ కలిపి ఒక్కటే పార్టీ అన్నట్టుగానే మనం వ్యవహరించాలని చంద్రబాబునాయుడు హితోపదేశం చేస్తున్నారు.
కూటమిలోని ఏ పార్టీ నాయకులపై ప్రతిపక్షం తప్పుడు ఆరోపణలు చేసినా సరే.. మూడు పార్టీల నాయకులూ వాటిని తిప్పికొట్టడంలో చురుగ్గా, దృఢంగా వ్యవహరించాలని చంద్రబాబు పిలుపు ఇస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. తమ తెలుగుదేశం నాయకుల మీద వస్తున్న నిందల విషయంలో.. మిగిలిన పార్టీల సహకారం గురించి ఆయన ఈ మాటలు చెప్పడం లేదు. ఆ రెండు పార్టీల మీద వచ్చే నిందలకు తన పార్టీ వారు తిప్పికొట్టాలని అంటున్నారు. నిజానికి ఈ ఐక్యంగా తిప్పికొట్టడం అనేది తెలుగుదేశానికి తక్కువ అవసరమే. ఎందుకంటే.. రాష్ట్రవ్యాప్తంగా నాయకుల సంఖ్య ఎక్కువగా ఉండే పార్టీ గనుక.. ఆ పార్టీలోని ఎవ్వరిని ఏం అన్నా సరే.. అందరూ కలిసి విరుచుకుపడిపోతారు. కానీ.. మిగిలిన వారికి బలం తక్కువ కాబట్టి.. మనం తోడ్పడాలి అంటున్నారు చంద్రబాబు.

రాహుల్ గాంధీ మోడీ తల్లిని విమర్శించినప్పుడు గానీ, సుగాలి ప్రీతి విషయంలో పవన్ కల్యాణ్ ను వైసీపీ విమర్శించినప్పుడు గానీ.. తెలుగుదేశం నాయకులు స్పందించకుండా మౌనంగా ఉండడాన్ని చంద్రబాబునాయుడు తప్పు పడుతున్నారు. మూడు పార్టీలు కలిసే మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని.. ప్రతి ఒక్కరి గౌరవాన్ని అందరూ కలిసి కాపాడడం ముఖ్యం అని చంద్రబాబు అంటున్నారు. నిజంగానే మూడు పార్టీల మధ్య చంద్రబాబునాయుడు చెబుతున్నంత ఐక్యత సాధ్యమైతే గనుక.. కూటమికి అది శ్రీరామరక్షగా నిలుస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories