రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అవకాశం కల్పిస్తూ.. చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకాన్ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. మహిళల సొంత జిల్లాలో మాత్రమే ఉచితం అని తొలుత ప్రకటించిన చంద్రబాబు, రాష్ట్రమంతా వర్తించేలా అమలు చేశారు. ఆ మేరకు మహిళలకు చంద్రబాబు గొప్ప వరం ప్రకటించారు. ఇప్పుడు అదే మహిళలకు తిరుమల వెంకటేశ్వరుని అనుగ్రహం కూడా తోడైంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే బస్ సర్వీసులలో కూడా ఉచిత ప్రయాణ అవకాశం కల్పించేలా ఆర్టీసీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ స్వయంగా ప్రకటించారు.
స్త్రీశక్తి పథకాన్ని తొలుత అమలు చేసినప్పుడు.. ఘాట్ రోడ్లలో ఉచిత ప్రయాణాన్ని అనుమతించలేదు. నాన్ స్టాప్, ఏసీ, డీలక్స్, సూపర్ లగ్జరీ వంటి బస్సులలో ప్రయాణాన్ని కూడా ఉచితం నుంచి మినహాయించారు. ఆ క్రమంలో తిరుపతి- తిరుమల మధ్య తిరిగే బస్సు సర్వీసులు నాన్ స్టాప్ సర్వీసులే కావడం, పైగా ఘాట్ రోడ్డు సర్వీసులు కావడం వలన ఉచితం వర్తించకుండా పోయింది. కానీ.. పథకాన్ని ప్రారంభించిన క్షణం నుంచి ఎప్పటికప్పుడు మహిళల, ప్రజల స్పందనను తెలుసుకుంటూ.. సమీక్షిస్తూ వచ్చిన చంద్రబాబు.. తొలుత మన్యం, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది మహిళలకు ఈ ఉచిత రవాణా సదుపాయం అందడం లేదని గ్రహించారు. వెంటనే.. ఘాట్ రోడ్లలో కూడా ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే తిరుపతి- తిరుమల మధ్య మాత్రం ఉచితం అప్పటికి అమలు కాలేదు.
మళ్లీ నిరంతర సమీక్ష్లలతో ప్రజాభిప్రాయ సేకరణలతో పథకం అమలులో అవసరమైన మార్పు చేర్పులు చేయడానికి సిద్ధంగానే ఉన్న కూటమి ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తుండగా.. తిరుపతి- తిరుమల మధ్య ప్రతిరోజూ వేల సంఖ్యలో ఉండే వారికి మాత్రం ఎందుకు కట్టడి చేయాలని ప్రభుత్వం అనుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు తిరుమలకు వెళ్లే మహిళలకు కూడా ఉచిత ప్రయాణం వర్తించేలా కొనకళ్ల నారాయణ నిర్ణయం ప్రకటించారు.
ఆగస్టు 15న ఏపీ సర్కారు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా గణాంకాలు పరిశీలించినప్పుడు 16వ తేదీన పదిలక్షలు, 17న 15 లక్షలు, 18న 18 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ అవకాశాన్ని వినియోగించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రులకు వెళ్లేవారు, పుణ్యక్షేత్రాలకు, చిరుద్యోగాలకు వెళ్లే బడుగు మహిళలకు స్త్రీశక్తి పథకం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని ప్రజలు హర్షిస్తున్నారు. స్త్రీశక్తి అనేది ఏపీలోని మహిళాలోకానికి చంద్రబాబునాయుడు ఇచ్చిన వరం అయితే.. తిరుమలకు కూడా పథకం వర్తించడం అనేది తిరుమలేశుని అనుగ్రహమేనని మహిళలు భావిస్తున్నారు.