జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో చంద్రబాబునాయుడు ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ‘ఒక ముసలాయన ఉన్నాడు..’ అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రత్యర్థులు మాత్రమే కాదు, చనువు ఉన్న తమ సొంత మనుషులు అయినా సరే.. వారి వయసులోని ముసలితనం గురించి, శారీరక వైకల్యాల గురించి మాట్లాడడం అనేది ఎప్పుడూ మంచి పద్ధతి కాదు. అది వాచాలత్వమూ చవకబారుతనం కిందికి వస్తుంది. జగన్ మాత్రం ప్రతిసందర్భంలోనూ చంద్రబాబు విషయంలో అదే పనిచేస్తుంటారు. అయితే చంద్రబాబు మాత్రం తాజాగా తన ఎన్నికల ప్రచారంలో.. తన వయసు గురించి మరోమారు మాట్లాడే సాహసం చేయకుండా.. జగన్ కు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మళ్లీ నోరుమెదపని పరిస్థితి క్రియేట్ చేశారు.
‘నా వయసు గురించి జగన్ మాట్లాడుతున్నారు. నాలాగా రెండు గంటలు ఎండలో నిల్చో జగన్.. నీ కథ తేలిపోతుంది అంటూ చంద్రబాబు సవాలు విసిరారు. బేసిగ్గా చంద్రబాబునాయుడు ఎంత సీనియర్ నాయకుడు అయినప్పటికీ.. ఆయన ఫిట్ నెస్ విషయంలో చాలా పద్ధతిగా ఉంటారు. మితాహారం తీసుకుంటారు. ఆయనలా శారీరక కష్టానికి సిద్ధంగా ఉండగల రాజకీయ నాయకుడు సమకాలీననేతల్లో దేశంలోనే మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఈ ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడే రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధపడ్డారు గానీ.. పార్టీ ఇతర అవసరాలు.. అనేక వ్యూహరచనల కారణంగా పాదయాత్రను లోకేష్ తో చేయించారు. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేయగల స్థాయి ఫిట్ నెస్ ఉన్న వ్యక్తి చంద్రబాబు అనడంలో సందేహం లేదు. అయితే జగన్ మాత్రం.. వయసు గురించి చాలా వెటకారంగా, హేయంగా మాట్లాడుతూ ఉంటారు. గత అయిదేళ్లలో ఆయన ఎన్నడూ శారీరక కష్టం కలిగే పనిచేసింది లేదు. తాడేపల్లి నుంచి తెనాలిలో సభ పెట్టినా సరే.. హెలికాప్టర్ లో వెళ్లే సుఖానికి అలవాటుపడ్డారు. అందుకే.. ముసలితనం గురించి మళ్లీ నోరెత్తే ధైర్యం లేకుండా.. నాలాగా రెండు గంటలు ఎండలోనిల్చో చూద్దాం అంటూ చంద్రబాబు సవాలు విసరడం విశేషం.
బాబు అంతటితో వదలిపెట్టలేదు. నేను ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివా.. నువ్వేం చదివావ్.. ఏ యూనివర్సిటీలో చదివావ్.. రహస్య యూనివర్సిటీలో చదివావా అంటే ఎద్దేవా చేశారు. జగన్ తన విద్యార్హతల గురించి ఎన్నడూ చాలా గోప్యంగా ఉంచుతారనే సంగతి తెలిసిందే. విదేశాల్లో చదివినట్టు చెప్పుకుంటారు తప్ప.. వివరాలు బయటపెట్టరు. ఆవిషయాన్నే ఎత్తిచూపిన చంద్రబాబు.. నువ్వు గోలీలు ఆడుకుంటున్న సమయంలో నేను ముఖ్యమంత్రిని అయ్యా అంటూ చరిత్ర చూసుకో అంటే గేలిచేశారు.
తనపై చవకబారు విమర్శలకు ఇవన్నీ కౌంటర్లు అనుకోవచ్చు గానీ.. చంద్రబాబునాయుడు మాటల్లో ఒక్క విషయం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేదిగా ఉంది. తాను సీఎంగా ఉన్న పద్నాలుగు ఏళ్లలో ఎనిమిది సార్లు డీఎస్సీ వేశానని, జగన్ అయిదేళ్లలో ఎన్ని డీఎస్సీలు వేశారో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. మరి దీనికి వైసీపీ వారి వద్ద పాపం ఏం జవాబు ఉంటుంది.