ఏపీలో వాలంటీర్లు దాదాపుగా అందరూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలే అనే సంగతి అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికే వారందరూ కంకణం కట్టుకుని పనిచేస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం పెట్టడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే గనుక.. వాలంటీర్ల మీద ఈసీ వేటు వేసేస్తుండడంతో వారు చేతులు కట్టేసినట్టుగా ఉంటున్నారు. ఇలాంటినేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం వాలంటీర్ల మీద చంద్రబాబునాయుడు సమ్మోహక అస్త్రం ప్రయోగించారు. తమ ప్రభుత్వం ఏర్పడితే వారి నెలజీతాన్ని రూ.పదివేలకు పెంచుతామని చంద్రబాబు పేర్కొన్నారు.
నిజానికి ఈ జీతం పెంపు అనే వరం.. వాలంటీర్ల మీద తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం వాలంటీర్లకు అన్నీ కలిపి సుమారు 6 వేల వరకు మాత్రమే ముట్టుతోంది. ఆ మొత్తానికే వారు నెలపొడవునా సేవలు అందిస్తున్నారు. జీతం పెంపు గురించి గతంలో వాలంటీర్లు అనేక ఆందోళనలు కూడా నిర్వహించారు గానీ.. ప్రభుత్వం పట్టించుకోలేదు. అదే ఎన్నికల సమయం వచ్చేసరికి, ఓటర్లను, లబ్దిదారులైన ముసలివాళ్లను ప్రలోభ పెట్టడానికి వాలంటీర్లు బాగా పనికొస్తారనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాలంటీర్లకు భారీగా తాయిలాలు, నగదు కానుకలు ఇచ్చి వారితో తమకు అనుకూలంగా పనిచేయించుకునే ఉద్దేశంతో ఉన్నారు. చంద్రబాబునాయుడు గెలిస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దవుతుందని, మీ ఉద్యోగాలు పోతాయని వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకవైపు ఇలాంటి కుట్రలు నడుస్తుండగా చంద్రబాబునాయుడు మాత్రం ఏకంగా.. తన ప్రభుత్వం ఏర్పడగానే.. రూ.పదివేల జీతం చేస్తానని ప్రకటించి.. వాలంటీర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వాలంటీర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారు. వారికి 6 వేలనుంచి 10వేలకు ఒకేసారి జీతం పెరగడంఅనేది చాలా పెద్ద వరం కింద లెక్క. వైసీపీ అభ్యర్థులు ఎన్నికల సీజన్లో ఇచ్చే దొంగచాటు కానుకల కంటే.. చంద్రబాబు గెలిస్తే.. అధికారికంగా తమకు పదివేల జీతం వస్తుందనే హామీ వారిని బాగా ఊరించగలదు.
ఈ నేపథ్యంలో వాలంటీర్లను అడ్డగోలుగా తమ పార్టీ ప్రచారానికి వాడుకోవాలనుకుంటున్న వైసీపీ వ్యూహాలు ఫలించకపోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ వాలంటీర్లతో ప్రస్తుతానికి రాజీనామా చేయించి అయినా తమ ప్రచారానికి వాడుకోవాలనిచూస్తోంది. రాజీనామా చేస్తే ఎన్నికలయ్యేదాకా తామే జీతాలు ఇస్తామని కేండిడేట్లు చెబుతున్నారు. పోలింగ్ ఏజంట్లుగా వాడాలని కూడా చూస్తోంది. అయితే చంద్రబాబునాయుడు ఈ కొత్త వరం ప్రకటించిన తర్వాత.. వాలంటీర్లు ఎవ్వరూ రాజీనామా చేయకపోవచ్చు. పైగా వారు చంద్రబాబు గెలవాలని కోరుకునే అవకాశం ఉంది. అదే జరిగితే.. వైఎస్సార్ కాంగ్రెస్ నోట మట్టే అని పలువురు విశ్లేషిస్తున్నారు.