ఎవరూ ఏమీ చెప్పవలసిన అవసరం లేకుండానే చిటికెలో విపులంగా అర్థమైపోయే విషయాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు.. ఒక గదిలో ఎలుక, పిల్లి మాత్రమే ఉన్నాయని అనుకోండి. ఆ ఎలుక తనకు ప్రాణభయం ఉన్నదని ప్రకటిస్తే ఏమిటి అర్థం. ఆ భయానికి కారణం పిల్లి అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ కూడా అలాంటిదే. అలాంటి జగన్ మార్క్ క్షుద్ర రాజకీయాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో దండెత్తుతున్నారు.
రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జగన్ పర్యటిస్తున్న కారు కింద పడి చీలి సింగయ్య దారుణంగా మరణించిన సంగతి అందరికీ తెలుసు. వీడియోల సాక్షిగా రాష్ట్ర ప్రజలు అందరూ ఆ దుర్మార్గాన్ని గమనించారు. కేసు పురోగతిలో ఉంది. మరణించిన సింగయ్య భార్య స్వయంగా పోలీస్ కేసు పెట్టారు. నిన్నటి దాకా ఆమె కూడా అదే వాదన వినిపించారు. హఠాత్తుగా జగన్ తన ప్యాలెస్ కు పిలిచి పది లక్షల రూపాయలు ఇవ్వగానే మాట మార్చారు. నిన్నటివరకు వైసీపీ దళాలు ఏ పాట పాడుతూ వచ్చాయో.. ఇప్పుడు ఆమెకూడా అదే రాగం అందుకున్నారు. ఇలాంటప్పుడు ఎవ్వరైనా సరే ఏం అనుకుంటారు? జగన్ ఇచ్చిన పది లక్షలు బాగానే పని చేశాయని అనుకుంటారు. లేదా అంతకు మించిన బెదిరింపులు ఏవో పని చేసి ఉండాలని భావిస్తారు. ఇప్పుడు చంద్రబాబు అదే విషయం చెబుతున్నారు. లుర్తు మేరీ ని జగన్ బెదిరించడం గురించి నిప్పులు చెరుగుతున్నారు.
జగన్ చేసిన పని గురించి ప్రజలు కూడా నవ్వుకుంటూ ఉండడం గమనార్హం. ఒక కుటిల వ్యూహం అమలు చేసినా కూడా.. అందులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఇలా ప్రజలకు దొరికిపోయే లాగా ఆమెతో మాట మార్పించడం వల్ల.. జగన్ పరువు పాతాళానికి పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.