చంద్రబాబు శ్రద్ధ : పెన్షన్లు ఆగడానికి వీల్లేదు!

ఓటర్లను, ప్రధానంగా వృద్ధులను ప్రలోభ పెట్టడానికి వాలంటీర్లను ఒక బ్రహ్మాస్త్రంలాగా వాడుకోవాలనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటిల ఆలోచన. దానికి తగ్గట్టుగానే వాలంటీర్ల వ్యవస్థను వారు సిద్ధం చేసి పెట్టుకున్నారు. అయితే సిటిజన్ ఫోరం ఫర్ డెమాక్రసీ సంస్థ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేసిన ఫిర్యాదుతో ఈ ప్రలోభాల కుట్రను గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం.. వాలంటీర్లను ఈ రెండునెలల పాటూ పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సాకుగా వాడుకుని రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడకుండా.. చంద్రబాబునాయుడు లబ్ధిదారులు అందరికీ పెన్షన్లు సకాలంలో అందడం గురించి శ్రద్ధ చూపిస్తున్నారు. ఎప్పటిలాగానే ఏప్రిల్ నెల 1 నుంచి 5 వతేదీలోగా లబ్ధిదారులు, వృద్ధులు అందరికీ పెన్షన్లు నగదురూపంలో అందేలాగా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబునాయుడు సీఎస్ జవహర్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక లేఖ పంపారు.

ప్రభుత్వ యంత్రాంగంలోని గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయించాలని చంద్రబాబు కోరుతున్నారు. సచివాలయసిబ్బంది పెన్షన్ ల మొత్తాన్ని బ్యాంకులనుంచి తీసుకువెళ్లడానికి అనుమతిఇవ్వాలని సీఎస్ ను కోరుతున్నారు. పెన్షన్ల సొమ్మును అసలు ప్రభుత్వం సిద్ధం చేయనేలేదని వార్తలు వస్తున్నాయని, వెంటనే నిధులు సిద్ధం చేసి ఎప్పటిలాగా ఒకటోతేదీకి నగదు అందేలా చూడాలని ఆయన కోరుతున్నారు.

వాలంటీర్లను ఇంటింటికీ పంపడం ద్వారా వారిద్వారా కేవలం పెన్షన్ డబ్బు పంపిణీ మాత్రమే కాదు.. ఓటర్లను ప్రలోభపెట్టే నగదు డబ్బును కూడా వారితోనే పంపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అదే వాలంటీర్ల రూపంలో తమ కార్యకర్తలను తొత్తులను నియమించుకున్న వైసీపీ నాయకులు.. వారిద్వారా ఇంటింటికీ జగన్ అనుకూల ప్రచారం చేయించాలని కూడా అనుకున్నారు. ఇన్నాళ్లూ కూడా అదే పని చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వారి కుట్ర ఆలోచనలకు తెరపడింది. అధికార పార్టీ ఇంకా షాక్ లోనే ఉన్నది. ఈనేపథ్యంలో వారు ఎలాంటి తేడా చేసి.. లబ్ధిదారులను ఇబ్బందిపెట్టకుండా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సజావుగా చేయాలంటూ చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి లేఖ రాయడం విశేషం. 

Related Posts

Comments

spot_img

Recent Stories