చంద్రబాబు రాజనీతి : జ్వాలలు చల్లారుతున్నాయ్!

అభ్యర్థుల ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీలోని పలు నియోజకవర్గాల్లో అసమ్మతి జ్వాలలు రేగాయి. అయితే ప్రత్యర్థి కంటె ముందుగానే టికెట్లు ప్రకటించేయడం ద్వారా కాస్త ఎడ్వాంటేజీ దక్కించుకున్న చంద్రబాబునాయుడు.. అసమ్మతుల్ని ఎక్కడికక్కడ బుజ్జగించడానికి, పరిస్థితుల గురించి సర్దిచెప్పి వారిని ఒప్పించడానికి సమయం వెచ్చిస్తున్నారు. ఆయన రాజనీతి ఫలిస్తోంది. టికెట్ దక్కలేదనే బాధతో ఉన్న పార్టీ నాయకులను చంద్రబాబు పిలిచి మాట్లాడుతున్నారు. ఆయనను కలిసిన తర్వాత.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్న నాయకులు నియోజకవర్గంలో పార్టీ గెలుపుకోసం మనస్ఫూర్తిగా పనిచేయడానికి తిరిగి వెళుతున్నారు.

రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకున్న నేపథ్యంలో.. వారికి ఏకంగా 31 అసెంబ్లీ స్థానాలను కేటాయించిన నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీలో అసంతృప్తులు రేగడం సహజం. అందుకే చంద్రబాబు నాయకుల్ని ఉండవల్లిలోని నివాసానికి పిలిపిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాల్సిన పరిస్థితి, ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే.. రాష్ట్రం ఎంతగా అథోగతి పాలవుతుందనే వాస్తవాల్ని ఆయన వారికి వివరించి చెబుతున్నారు. రెండు పార్టీలతోనూ ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో.. వారి అవసరం ఏమిటో వివరంగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు ధర్మాన్ని అనుసరిస్తూ.. వారి విజయానికి కూడా మనందరం మనస్ఫూర్తిగా పనిచేసినప్పుడే.. అధికారంలోకి రావడం కుదురుతుందని నచ్చజెపుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకోసం కష్టపడిన వారందరికీ, పొత్తుల కారణంగా నష్టపోయిన వారందరికీ కూడా తగిన పదవులు దక్కుతాయని చంద్రబాబు భరోసా ఇస్తున్నారు.

టికెట్ రాలేదని తెలిసిన క్షణానికి ఉండే ఆవేశం నాయకుల్లో కూడా చల్లబడుతోంది. నెమ్మదిగా వారు పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి ఏపీ అధ్క్ష్యక్షుడుగా కూడా సేవలందించిన సీనియర్ నాయకుడు కళా వెంకట్రావుకే ఈసారి టికెట్ ఇవ్వలేదు. చంద్రబాబును నివాసంలో కలిసిన ఆయన భేటీ తర్వాత.. ‘అంతా మంచే జరుగుతుందని చెప్పారు. ఆయన మాటలకు కట్టుబడి సంతృప్తికరంగా వెళుతున్నాను’ అంటూ కన్విన్స్ కావడం గమనార్హం. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, పెనమలూరు టికెట్ ఆశించి భంగపడి- ఇండిపెడెంటుగా నైనా బరిలోకి దిగాలని అనుకున్న బోడె ప్రసాద్, కొవ్వూరులో తనకు కాకుండా మరొకరికి టికెట్ ఇవ్వడంతో అలిగి స్వతంత్రంగా పోటీచేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి జవహర్.. తదితర సీనియర్ నాయకులు ఎందరో చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. వారందరినీ కూడా ప్రస్తుతానికి చంద్రబాబు బుజ్జగించినట్టే.
నెమ్మదిగా అసమ్మతి రాగాలు తగ్గుతున్నాయని, మామూలు వాతావరణం నెలకొంటోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వారంలోగా ఎక్కడా ఏ ఇబ్బందీ తలెత్తకుండా పొత్తుల్లో మూడు పార్టీలు కలిసిమెలిసి పనిచేస్తాయని, మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ అనేది నూరుశాతం జరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories