అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా సాగనుంది. ఏనాడైతే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలను స్వీకరించారో ఆరోజే అమరావతికి మహర్దశ పట్టనున్నదని రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు. ఏ చంద్రబాబు నాయుడు అయితే తన కలల రాజధానిగా అమరావతిని స్వప్నించి, ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని అనుకున్నారో ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావడం శుభపరిణామంగా అందరూ భావించారు. దానికి తగినట్టుగానే ఆయన తొలి అడుగులు కూడా అమరావతి నిర్మాణం దిశగా సాగాయి. అయితే అనూహ్యమైన వేగంతో అమరావతి నిర్మాణాలను పూర్తి చేయడానికి తాజాగా కొత్త కసరత్తును కూడా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు ప్రభుత్వం తాజాగా రెండేళ్ల గడువు నిర్దేశించింది. ఈ వ్యవధిలోగా వారికి కేటాయించిన భూములలో నిర్మాణాలను పూర్తి చేయాలని అంటోంది. ఆసక్తి ఉన్న, పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలు మాత్రమే ముందుకు రావాలని కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తున్నారు. సి ఆర్ డి ఏ నగర పరిధిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతలాకుతలం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో దీనిని తిరిగి యధాపూర్వస్థితికి తీసుకువస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరొక గొప్ప పరిణామం ఏంటంటే రాజధాని ప్రాంత రైతులకు మరొక ఐదేళ్లపాటు కౌలు చెల్లించాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత వారితో ఒప్పందాలు చేసుకున్నప్పుడు కేవలం పదేళ్ల వరకు మాత్రమే కౌలు చెల్లించాలని నిర్ణయించారు. అయితే రాజధానికి గ్రహణం పట్టినట్టుగా దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి మధ్యలో ముఖ్యమంత్రి కావడంతో నిర్మాణ పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో ఇంకొక ఐదేళ్లు మాత్రం కౌలు చెల్లించాలని నిర్ణయించారు.
అలాగే బిట్స్ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థలను కూడా అమరావతికి ఆహ్వానించాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. ఇవాళ దక్షిణ భారతదేశంలో హైదరాబాదులో బిట్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఉన్నదంటే దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే. అలాగే అమరావతికి కూడా తీసుకురావాలని అనుకుంటున్నారు.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు పొందిన 130 సంస్థలతో వెంటనే సంప్రదింపులు జరపాలని పురపాలక శాఖ మంత్రి నారాయణను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ కేటాయింపులను సమీక్షించాలని కూడా నిర్ణయించారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే పనులు ప్రారంభించాలని అందుకు సంబంధించిన అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు కల్పనకు ఆల్రెడీ పనులు మొదలయ్యాయని కూడా ప్రభుత్వం చెబుతోంది. అమరావతిని దేశంలోనే ప్రఖ్యాత విద్యా హబ్ గా తీర్చిదిద్దేలాగా పేరెన్నికగన్న సంస్థలను ఆహ్వానించాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి అమరావతి రాజధాని లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే సంస్థలకు రెండేళ్ల గడువు నిర్దేశించడం ద్వారా నగర నిర్మాణానికి టాప్ గేర్ వేసినట్లు అయింది. కుడిఎడమగా ఒక ఏడాది ఆలస్యం అయినా సరే మూడేళ్ల వ్యవధిలోగా 130 సంస్థల నిర్మాణాలు పూర్తయితే గనుక అమరావతి రాజధానికి ఒక స్థాయి వరకు సంపూర్ణమైన రూపం వచ్చేస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.