లోపరహిత వ్యూహాలను రెడీ చేస్తున్న చంద్రబాబు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు.. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. చావో రేవో అన్నట్టుగా తలపడుతున్నారు. భాజపా, జనసేనలతో పొత్తు పెట్టుకోవడం మాత్రమే కాదు.. ఆ పొత్తు బంధంలో ఎలాంటి పొరపొచ్చాలు తలెత్తకుండా, అందరూ సమన్వయంతో పనిచేసేలా కూడా ఆయనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ పార్టీలో అసంతృప్తికి గురవుతున్న అందరికీ సర్దిచెబుతున్నారు. ఇన్ని జాగ్రత్తల మధ్య ఎన్నికల ప్రచార వ్యూహాలు ఏమాత్రం లోపాలు లేకుండా సాగడానికి మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం విశేషం.

శనివారం నాడు తెలుగుదేశం పార్టీ తమ పార్టీ తరఫున పోటీచేయబోయే అభ్యర్థులకు విజయవాడలో ఒక వర్క్ షాప్ నిర్వహించబోతోంది. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, వైసీపీ కుట్రలను ఎదుర్కోవడానికి ఉండవలసిన సంసిద్ధత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇత్యాది అంశాల గురించి ఆ వర్క్ షాప్ లో అభ్యర్థులకు ఉదయం నుంచి రాత్రి వరకు శిక్షణ ఉంటుంది.

ఈ వర్క్ షాప్ కు కేవలం అభ్యర్థులు మాత్రమే కాకుండా.. ప్రతి నియోజకవర్గం నుంచి నలుగురు కీలక వ్యక్తులను కూడా పిలుస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి పార్టీ ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, పొలిటికల్ మేనేజర్, మీడియా మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్ అనే డిజిగ్నేషన్లో కొందరిని నియమించింది. ఆయా వ్యవహారాలకు సంబంధించి సమన్వయ బాధ్యతలు మొత్తం వారే చూస్తారు.

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి ప్రతి ఎత్తుగడ మీద నియోజకవర్గంలో ఈ నలుగురు కీలక వ్యక్తులకు అవగాహన ఉండాలని, వారందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచిస్తున్నారు.

తెలుగుదేశం ఇంకా 16 స్థానాల్లో అబ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. శనివారం వర్క్ షాప్ లోగా ఆ పెండింగ్ జాబితా కూడా ప్రకటించేస్తారనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీల విషయంలో ఇంకా తుది వడపోత జరగకపోయినప్పటికీ.. ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ఈ వర్క్ షాప్ ఉంటుందని అంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో చతుర్ముఖ వ్యూహం అనుసరిస్తున్నట్టుగా.. అభ్యర్థికి సహకరించడానికి నలుగురిని కీలకంగా నియమించడం సత్ఫలితాలను ఇస్తోంది. వీరందరూ సమన్వయంతో పనిచేస్తే.. ఎలాంటి లోపాలు దొర్లకుండా ప్రచారం సాగుతుందని, ప్రత్యర్థిని కట్టడిచేయవచ్చునని చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories