జగన్ బాధిత జర్నలిస్టులకు చంద్రబాబు శుభవార్త

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో నానా కష్టాలు పడిన, వేధింపులకు గురైన వారిలో ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, ఆయనను ధిక్కరించిన వారు, ఉద్యమకారులు వంటి వారు మాత్రమే కాదు. నిజాలు మాట్లాడిన జర్నలిస్టులు కూడా ఉన్నారు. తమకు న్యాయం కావాలని కోరిన ఉద్యోగులు కూడా ఉన్నారు. టీచర్లున్నారు. ఇలా తనను ధిక్కరించినా, తనకు కిట్టని పనిచేసినా.. ప్రతి ఒక్కరినీ జగన్మోహన్ రెడ్డి కేసులతో వేధించారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ఆయా వర్గాల మీద పెట్టిన అక్రమ, వేధింపుల కేసులన్నింటినీ ఎత్తి వేయడానికి నిర్ణయిచింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తితే చాలు.. ఆ గళాన్ని అణిచేయడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగాయో లెక్కేలేదు. మూడు రాజధానుల పేరుతో అమరావతికి అన్యాయం చేస్తున్నారు.. అనే అభిప్రాయాన్ని పంచుకున్నందుకు కూడా.. అరవయ్యేళ్ల మహిళ మీద సీఐడీ కేసులు నమోదు చేసి అరెస్టు చేసి విచారణ పేరుతో వేధింపులు రుచిచూపించారు. సోషల్ మీడియాలో వైసీపీ సైకోల్లాగా బూతులు పెట్టడం కాదు.. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల మీద సత్ప్రవర్తన గల భాషలో అభిప్రాయాలు పెట్టినా కూడా అలాంటి వారు సీఐడీ కేసులకు బలయ్యారు.

ఈ వర్గాలు మాత్రమే కాదు.. తమకు న్యాయంగా అందవలసిన వాటి గురించి అడిగినందుకు ఉద్యోగ వర్గాల మీద జగన్ ఎన్ని కేసులు పెట్టించారో లెక్కేలేదు. ప్రతి ఆందోళనను అణిచివేయడానికి ప్రయత్నించారు. కేవలం ఉద్యోగులు పిలుపు ఇచ్చిన ఆందోళనను ముందే పసిగట్టి విఫలం చేయడం చేతకాలేదని.. డీజీపీ గౌతం సవాంగ్ ను పక్కకు తప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అంతగా ఉద్యోగుల పట్ల కర్కశంగా వ్యవహరించారు. ఉపాధ్యాయుల మీదనైతే ప్రత్యేకంగా కక్ష కట్టారనే చెప్పాలి. అన్ని రకాలుగానూ వారిని ఇబ్బంది పెట్టాలని చూశారు. చివరికి టీచర్లలో తన మీద వ్యతిరేకత ఉంటుందనే భయంతో.. వారిని ఎన్నికల విధులనుంచి తప్పించేందుకు కూడా విఫలప్రయత్నం చేశారు. ఆయా వర్గాలు అందరి మీద లెక్కకు మిక్కిలిగా కేసులు పెట్టించారు.

అందుకే తెలుగుదేశం పాలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, జర్నలిస్టులపై జగన్ సర్కారు పెట్టించిన అక్రమ కేసులను ఎత్తేయించాలని నిర్ణయించారు. నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఆ వర్గాల నుంచి ఇందుకోసం విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి. మొత్తానికి కాస్త ఆలస్యంగా అయినా జగన్ బాధిత జర్నలిస్టులకు, ఇతర వర్గాలకు న్యాయం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories