కొత్త సంవత్సరం సందర్భంగా మీడియా వారితో సుదీర్ఘంగా అనేక విషయాలు పంచుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈ సందర్భంగా ఆయనలోని ఉదారవాద స్వభావం, జగన్ పట్ల జాలి కూడా వెలికి రావడం విశేషం. అదానీ సంస్థల నుంచి 1750 కోట్ల రూపాయల లంచాలు తీసుకుని, జగన్ రాష్ట్రానికి లక్షన్నర కోట్లకు పైగా నష్టం చేకూర్చేలా సెకితో ఒప్పందాలు చేసుకున్నారనే సంగతి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా హాట్ టాపిక్ గా నలుగుతూనే ఉంది. జగన్ మీద విచారణ జరిపించాలని ప్రెవేటు వ్యక్తులు కేసులు పెట్టారు కూడా. మరొకవైపు సెకితో చేసుకున్న ఒప్పందాలను తక్షణం రద్దు చేసుకోవాలని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల గానీ, వామపక్షాల నాయకులు గానీ పదేపదే కోరుతున్నారు. జగన్ మీద విచారణ జరిపించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబునాయుడు మాత్రం జగన్ పట్ల తన ఉదార వాద ధోరణిని కనబరుస్తున్నారు.
మీడియా విలేకరులు కూడా ఇదే ప్రశ్నలు అడిగినప్పుడు చంద్రబాబునాయుడు చాలా స్పష్టంగా సమాధానాలు చెప్పారు. జగన్ మీద కక్ష సాధింపునకు పాల్పడడం తన లక్ష్యం కాదని కుండబద్ధలు కొట్టి చెప్పారు. జగన్ మీద చర్యలు తీసుకోవడానికి, అరెస్టు చేసి జైల్లో పెట్టడానికి సెకితో కుదుర్చుకున్న ఒప్పందం ఒక లడ్డూ లాంటి అవకాశం అని అంటూనే.. దానిని వాడుకుని జగన్ మీద కక్ష సాధించే ఉద్దేశం తనకు లేదని చంద్రబాబునాయుడు అంటున్నారు. సెకితో ఒప్పందాలను రద్దు చేసుకోవడం జరిగితే.. ప్రభుత్వం జరిమానా కట్టాల్సి వస్తుందనే సంగతిని ఆయన గుర్తుచేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం నాయకుల మీద విచ్చలవిడిగా కక్షసాధింపు ధోరణులకు పాల్పడ్డారని, తాము అలా చేయదలచుకోవడం లేదని అంటున్నారు. భూవివాదాల తేనెతుట్టెను కదపడం దగ్గరినుంచి జగన్ సర్కారు అనేక ఘోరాలు చేసిందని, అదే తరహాలో తాము వ్యవహరించాలనుకోవడం లేదని చంద్రబాబు అంటున్నారు. జగన్ ను అరెస్టు చేయడమే తన లక్ష్యం అయితే గనుక.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనిచేసి ఉండేవాడిని అని కూడా చంద్రబాబు చెబుతున్నారు. తమ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుందని, వైకాపా నాయకులకు తమకు ఉన్న తేడా అదేనని చెబుతున్నారు.
మొత్తానికి తనను ఇబ్బంది పెట్టిన, అరాచకంగా అరెస్టు చేసి జైల్లో పెట్టించిన శత్రువు పట్ల కూడా ఉదారవాద వైఖరి ప్రదర్శించడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైందని అంతా అనుకుంటున్నారు.