సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ.. ఉద్యోగాలు చేసే పద్ధతులు, పరిస్తితులు కూడా మారుతున్నాయి. ఐటీ ఉద్యోగాలలో ప్రపంచాన్నే శాసించేస్థాయికి చేరుకుంటున్న తెలుగు యువతరం.. ఈ కొత్త మార్పులను కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఇవాళ్టి రోజుల్లో చాలా మంది యువ ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇళ్లనుంచే పనిచేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం అనేది అటు కంపెనీలకు లాభసాటిగా, ఉద్యోగులకు ఉపయుక్తంగా.. అనివార్యమైన మార్పుగా సమాజంలోకి వచ్చేసింది. ఈ ప్రభావం వల్ల.. మారుమూల గ్రామాల్లోని తమ సొంత ఇళ్లలో కూర్చుని ప్రతినెలా లక్షల రూపాయల వేతనాలు సంపాదిస్తున్న వారున్నారు. అలాంటివారందరికీ చిన్న సమస్య ఉంది. పల్లెల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే పవర్ (కరెంటు) సమస్యలు కూడా. వర్క్ ఫ్రం హోం సదుపాయం ఉన్నాసరే, ఈ ఇబ్బందుల వల్ల, తమ సొంత గ్రామాలు కాకుండా పట్టణాల్లో ఉంటున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారి కష్టాలన్నింటినీ తుడిచిపెట్టేసేలా ముఖ్యమంత్ర చంద్రబాబునాయుడు ఒక సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వర్క్ ఫ్రం హోం పనిచేసుకునే యువతరం కోసం జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కడప జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు అక్కడి సమావేశంలో.. ఐటీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్లు చేతులు పైకెత్తాలని కోరినప్పుడు దాదాపు 40 మంది ముందుకొచ్చారు. వారి అనుభవాలను విని చంద్రబాబు ఎంతో సంతోషించారు. చంద్రబాబు దార్శనికత వల్లనే ఇవాళ ఇంట్లో కూర్చుని వర్క్ ఫ్రం హోం చేసుకుంటూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాం అంటూ యువతరం చెప్పుకొచ్చారు.
వారితో సంభాషించిన తర్వాత.. చంద్రబాబునాయుడు ఈ వర్క్ స్టేషన్ల నిర్ణయాన్ని ప్రకటించారు.
ఇలాంటి వర్క్ స్టేషన్లు అందుబాటులోకి వస్తే.. వర్క్ ఫ్రం హోం చేసుకునే యువతరానికి అది పెద్ద వరం అవుతుంది. చాలా మందికి ఇళ్లలో ఆఫీసు తరహాలో కూర్చుని పని చేసుకోగల సదుపాయాలు ఉండకపోవచ్చు.. పనికోసం ల్యాప్ టాప్ వారి వద్ద ఉంటుంది గానీ.. ఇతర సదుపాయాలు అంతగా ఉండకపోవచ్చు. ముందే చెప్పుకున్నట్టు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, కరెంటు సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు లేకుండా సరైన సదుపాయాలు ఏర్పాటుచేసి.. అందుబాటులో ఉంచినట్లయితే ప్రతిచోటా ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది. వర్క్ ఫ్రం హోం పద్ధతిని ఎంచుకునే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇలాంటి ఏర్పాటు నిజంగానే యువతరానికి పెద్ద వరం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నవీన తరానికి సంబంధిచిన ఆలోచనలు చేస్తూ.. ప్రజలకు మెరుగైన జీవన సరళిని అందించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేయడం బాగానే ఉంటుందంటున్నారు.