వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కింది స్థాయి నాయకులు కూడా చాలా వ్యూహాత్మకంగా తెలుగుదేశం వారిని లోబరచుకుని.. భవిష్యత్తులోనైనా వారిని ఇరుకున పెట్టడానికి, భ్రష్టుపట్టించడానికి కుట్రపూరిత అడుగులు వేస్తున్నారనే అభిప్రాయాలు.. క్షేత్రస్థాయిలో నలువైపుల నుంచి వినిపిస్తూ ఉంటాయి. ఇప్పట్లో తెలుగుదేశం, కూటమి పార్టీల నాయకులతో రాసుకుపూసుకు తిరుగుతూ.. ఎప్పుడైనా వారు నోరుజారిన సందర్భాలను జాగ్రత్తగా పట్టుకుని.. వచ్చే ఎన్నికల సమయంలో వారికి వ్యతిరేకంగా వాడాలనే కుట్రలు అనేకం రాజకీయాల్లో నడుస్తూనే ఉంటాయి. ఇలాంటి దురాలోచనపరులు అనేకమంది ఉంటారని, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో గ్రహించిన వ్యక్తి గనుకనే.. చంద్రబాబునాయుడు.. తన పార్టీ వారిని తరచూ హెచ్చరిస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులకు లోబడవద్దు, వారికి పనులు చేయవద్దు అని ఆ నడుమ చంద్రబాబునాయుడు వ్యాఖ్యానిస్తే దానిని రాద్ధాంతం చేయడానికి జగన్ మరియు ఆయన నీలిదళాలు విషపూరిత ప్రచారానికి తెగబడ్డాయి.
వైసీపీకి చెందిన వారికి సంక్షేమపథకాలు నిలిపివేయాల్సిందిగా చంద్రబాబు ఆదేశిస్తున్నారంటూ.. జగన్ ఆరోపణలు గుప్పించారు. అయితే.. ఇలాంటి విషం అంత తొందరగా ప్రజల బుర్రలకెక్కే అవకాశం తక్కువ! ఎందుకంటే.. గత ప్రభుత్వం కాలంలో ఎవరు లబ్ధిదారులుగా ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు కూడా సంక్షేమపథకాలు అందుతున్నాయి. ప్రత్యేకించి.. మేనెలలో ప్రారంభం కాబోతున్న తల్లికి వందనం నిధుల విషయంలో అయితే.. జగన్ సర్కారు ఇచ్చిన లబ్ధిదారుల సంఖ్యకు దాదాపు రెట్టింపుగా ఏడులక్షల పైచిలుకు మందికి కూటమి సర్కారు పథకాన్ని అమలు చేయనుంది. ఈ వాస్తవాలన్నీ క్షేత్రస్థాయిలో ఆ పథకాలు అందుకుంటున్న ప్రజలకు తెలుసు. వారెవ్వరూ జగన్ చల్లుతున్న విషబీజాలను పట్టించుకోలేదు.
అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో అంటకాగడం అనేది ఎంతో ప్రమాదకరం అనే హెచ్చరికను చంద్రబాబునాయుడదు తమ పార్టీ వారికి మరోసారి చేశారు. అదే సమయంలో జగన్ చేస్తున్న విషప్రచారానికి విరుగుడుగా.. క్లారిటీ కూడా ఇచ్చారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయపరమైన సంబంధాలు వేరు అని చంద్రబాబు తమ పార్టీ నేతలను హెచ్చరించారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాల్సిందేనని, కానీ ఇతరత్రా అనుబంధాలను పెంచుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ వారిని దరిచేరనివ్వవద్దని చంద్రబాబు అంటున్నారు. వైసీపీ వారితో కూటమి పార్టీల నాయకులు సంబంధ బాంధవ్యాలను కలిగిఉండడం అనేది పాముకు పాలు పోసినట్టే అని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నారు. ఆయన మాటలు పథకాల లబ్ధిదారులకు వర్తించవు. కానీ, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రలోభపరచి తమ దందాలు చేయాలనుకునే వైసీపీ వారికి లొంగవద్దని మాత్రమే చంద్రబాబునాయుడు హెచ్చరిస్తున్నారని, ఆయన క్లారిటీతో విషప్రచారాలు వైసీపీ నేతల పరువు మరింతగా తీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.