వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మెడికల్ కాలేజీల విషయంలో తన నాటకం బయటపడకుండా పలు సందర్భాల్లో మొసలి కన్నీరు కారుస్తూ ఉంటారు. ఏకకాలంలో రాష్ట్రం నలుచెరగులా మెడికల్ కాలేజీలు ప్రారంభించేసినట్టుగా ఆయన బిల్డప్పులు ఇస్తూ.. ఒక్క కాలేజీకి గానీ అవసరమైన భవనాలు, ల్యాబ్ లు నిర్మించకుండా, ఫాకల్టీని కూడా నియమించకుండా డ్రామాలు నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అధికారంలోంచి దిగిపోయిన తర్వాత.. మెడికల్ విద్య గురించి మొసలి కన్నీరు కారుస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే.. వైద్య సేవల పరంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో అద్భుతమైన సంస్థ ఏపీలో ఆవిర్భవిస్తే.. ఆ సంస్థను కూడా జగన్ సర్కారు ఏ విధంగా వేధించుకుతిన్నదో.. తాజాగా చంద్రబాబునాయుడు బయటపెట్టారు. నిజం చెప్పాలంటే.. నాణ్యమైన వైద్యసేవల పరంగా రాష్ట్ర ప్రజలకు జగన్ చేసిన ద్రోహంగానే దానిని ప్రజలు పరిగణిస్తున్నారు.
విభజన చట్టం పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన వరాల్లో ఎయిమ్స్ వైద్య సంస్థ కూడా ఒకటి. చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో మంగళగిరిలో 183 ఎకరాల భూములు కేటాయించి.. ఎయిమ్స్ నెలకొల్పడానికి తోడ్పాటు అందించారు. కేంద్రం కూడా 1618 కోట్ల రూపాయలు వెచ్చించి 960 పడకలతో ఎయిమ్స్ ను ఏర్పాటుచేసింది. కేవలం పదిరూపాయలకే ఓపీ సేవలు అందిస్తుంటారు. అలాంటి ఎయిమ్స్ కు అవసరమైన నీటి సరఫరాకు సహకరించకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టిందని చంద్రబాబు తాజాగా వెల్లడించారు.
పక్కనే కృష్ణా నది ఉన్నప్పటికీ.. నీటి అవసరాలు తీరలేని దుస్థితిలో ఎయిమ్స్ ను జగన్ సర్కారు ఉంచేసిందని.. దీంతో ప్రతిరోజూ 600 ట్యాంకర్లతో ఎయిమ్స్ వారు నీటిని తెప్పించుకోవాల్సి వచ్చేదని చంద్రబాబు వెల్లడించారు. ట్యాంకర్ల రాకపోకల తాకిడి కారణంగా చివరకు ఓపీని కూడా ఆపుకోవాల్సి వచ్చేదని అంటున్నారు. అంటే.. కేవలం చంద్రబాబు హయాంలో ఏర్పాటు అయిన సంస్థ ద్వారా.. పేద ప్రజలకు ఎయిమ్స్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందరాదనే దుర్బుద్ధితో జగన్ ఎలాంటి కుత్సితానికి పాల్పడ్డారో దీనిని బట్టి అర్థమవుతోంది. అలాంటి నాయకుడు మళ్లీ వైద్య సేవల గురించి.. తాను ఏం ఉద్ధరించదలచుకున్నాడో వాటి గురించి డప్పు కొట్టుకోవడం అనైతికం అని ప్రజలు భావిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం వ్యవహార సరళి ఎలా సాగిందంటే.. లక్షరూపాయలు విలువ చేసే మంచి ఆవును కొని తెచ్చుకుని, దానికి పగ్గం కట్టకుండా వదిలేసుకున్నట్టుగా ఉంది.. అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ కేవలం.. అమరావతి మీద కక్ష, చంద్రబాబు ముద్ర ఉన్న సంస్థల మీద ద్వేషంతోనే మంగళగిరి ఎయిమ్స్ సేవలు కూడా ప్రజలకు సవ్యంగా అందకుండా అడ్డుకోవడం అనేది నీతిబాహ్యమేనని పలువురు విమర్శిస్తున్నారు.