సంకల్పం ఏమిటో తేటతెల్లం చేసిన చంద్రబాబు!

జగన్మోహన్ రెడ్డి బారిన పడి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిదేళ్లపాటూ ఎలాంటి వినాశనాన్ని చవిచూసిందో.. దానినుంచి విముక్తి కల్పించి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి ట్రాక్ మీదకు తీసుకురావడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం శతథా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే అయిదు సంవత్సరాల కోసం తమ ప్రభుత్వ సంకల్పం అదేనని చంద్రబాబునాయుడు మరోమారు పునరుద్ఘాటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు అదే విషయాన్ని తేల్చి చెప్పారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన ప్రభుత్వ సంకల్పం ఏమిటో తెలియజెప్పారు.

గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను తిరిగి సాధించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. అయిదేళ్లలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. విభజన తర్వాత తొలి అయిదేళ్లలో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమలుకూడా.. జగన్ పాలనలో తరలిపోయాయి. ఇక్కడ స్థిరపడిన సంస్థలు కూడా తరలిపోయాయి. కొత్తగా ఒక్క పరిశ్రమ రాలేదు. ఉద్యోగ ఉపాధికల్పన అనే మాటలు జనం మరచిపోయారు. రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణరంగం సర్వనాశనం అయింది. జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి గ్రహణం పట్టినట్టుగా పట్టడంతో అభివృద్ధి మొత్తం పడకేసింది.

అమరావతిలో పెట్టుబడులు పెట్టిన వారు.. అక్కడి కార్యకలాపాలు మానుకుని తమ రియల్ వ్యాపారానికి హైదరాబాదులో పెట్టుబడులు పెట్టసాగారు. అదే సమయంలో.. విశాఖపట్నంలో వైసీపీ నేతల భూకబ్జా దాహాన్ని గమనించిన తర్వాత.. దానిని రాజధానిగా ఊదరగొట్టడానికి జగన్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. వ్యాపారులు ఎవ్వరూ ముందుకు రానేలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది.

ఏపీ బ్రాండ్ ను తిరిగి సాధిస్తాం అని చంద్రబాబు ఇవాళ అంటున్నారు గానీ.. నిజానికి ఆయన తిరిగి పాలన పగ్గాలు చేతపట్టిన తొలిరోజునుంచే అందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఆ సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాబు పాలనలో రాబోయే అయిదేళ్లలో రాష్ట్ర పురోగతిలో గుణాత్మక మార్పు కనిపిస్తుందని ప్రజలు నమ్ముతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories