మిత్రుల మద్య సమన్యాయం పాటిస్తున్న చంద్రబాబు!

చంద్రబాబునాయుడు కార్యకుశలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నలభై నాలుగేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన అనేక సందర్భాల్లో దానిని నిరూపించుకుంటూ వచ్చారు. అయితే నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు.. చాలా నిర్ణయాల విషయంలో అద్భుతమైన పరిణతిని చూపిస్తున్నారు. ఎన్నికల్లో పోటీచేయడానికి సీట్ల పంపకం దగ్గరినుంచి, గెలిచిన తర్వాత.. మంత్రి పదవుల పంపకం వరకూ చంద్రబాబు చాలా ఆచితూచి వ్యవహరించారు. ఇప్పుడు స్పీకరు, డిప్యూటీ స్పీకరు పదవుల విషయంలో కూడా మిత్రపక్షాల మధ్య సమన్యాయం పాటించబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఏపీ అసెంబ్లీకి స్పీకరుగా చింతకాయల అయ్యన్నపాత్రుడును చంద్రబాబునాయుడు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 21న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులతో ప్రమాణం చేయించడానికి సీనియర్ ఎమ్మెల్యే ఏడుసార్లు గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎంపికచేశారు. ఈ మేరకు మంత్రి పయ్యావుల కేశవ్ ఆయనకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. 20వ తేదీన గోరంట్ల ప్రోటెం స్పీకరుగా గవర్నరు ఎదుట ప్రమాణం చేస్తారు. 21, 22 తేదీల్లో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించి… స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఎన్నికలను నిర్వహిస్తారు.
స్పీకరు స్థానం సంగతి తేలిపోయింది. ఇక డిప్యూటీ స్పీకరు పోస్టును భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. మిత్రపక్షాలకు పదవులు పంచడంలో జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కగా, భాజపాకు ఒక్కటి మాత్రమే కేటాయించారు. అయినా సరే.. పొత్తు పార్టీలు అసంతృప్తులకు లోను కాకుండా కూటమిధర్మం పాటించాయి.

ఆ నేపథ్యంలో జనసేన, బిజెపి మధ్య సమన్యాయం పాటించడానికి చంద్రబాబునాయుడు డిప్యూటీ స్పీకరు పదవిని భాజపాకు కేటాయిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే.. ఆ పార్టీ తరఫున ఎవ్వరిని ప్రతిపాదిస్తారనేది ఆయన పార్టీ హైకమాండ్ నిర్ణయానికే వదిలేస్తారు. మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా.. అమిత్ షా తుదినిర్ణయంగా సత్యకుమార్ పేరు చెప్పేవరకు వెయిట్ చేసి.. ఆ తర్వాత జాబితా ప్రకటించారు. ఇప్పుడు కూడా బిజెపి నిర్ణయించిన వ్యక్తికే డిప్యూటీ స్పీకరు పదవి కట్టబెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే భాజపా తరఫున సుజనాచౌదరి డిప్యూటీ కావొచ్చునని వినిపిస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories