ఇదివరకటి పరిస్థితులు వేరు. రాష్ట్రం కొత్తగా ఏర్పడిన సందర్భంలో రాజకీయ రంగమే చాలా గందరగోళంలో ఉంది. అనుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర ఉన్నవారు చాలామంది తెలుగుదేశం లోకి రాదలుచుకున్నారు. వచ్చారు. తమ పార్టీ తరఫున గెలిచిన వారిని ఫిరాయింపజేసి అధికార పార్టీలో కలుపుకుంటున్నారంటూ జగన్ గగ్గోలు పెట్టారు. నైతిక విలువల గురించి మాట్లాడారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు చాలా కన్వీనియంట్ గా విలువల సంగతి మరిచిపోయారు. తెలుగుదేశం, జనసేన పార్టీల టికెట్ మీద గెలిచిన వారిని విచ్చలవిడిగా వైసీపీలో చేర్చుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు నైతిక విలువలను నేర్పుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ నుంచి వలస వచ్చి తమ పార్టీలో చేరాలనుకునే ఏ నాయకుడు అయినా సరే.. ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులకు కూడా రాజీనామా చేయాల్సిందే అని నిబంధన పెడుతున్నారు. తద్వారా భవిష్యత్తులో ఇతర పార్టీలు కూడా ఇదే తరహా నైతిక విలువల ప్రమాణాలను పాటించే లాగా ఆయన సెట్ చేస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే నమ్మకంతో.. అనేకమంది నాయకులు జగన్ కు గుడ్ బై చెప్పేసి తమ దారి తాము చూసుకుంటున్నారు. ప్రత్యేకించి ఎన్నికల్లో ఓడిపోవడం మాత్రమే ఇందుకు కారణం కాదు. కనీసం పార్టీ పునర్నిర్మాణ వ్యవహారాలలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న అప్రజాస్వామిక, ఒంటెత్తు పోకడల వలన కూడా పలువురు నాయకులు పార్టీని వీడుతున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు విధించిన నైతిక విలువల కండిషన్ ప్రకారం వైసీపీ ద్వారా తమకు దక్కిన పదవులకు రాజీనామా చేసి అయినా సరే, ముందు ఆ పార్టీ నుంచి బయటపడాలని వారు తొందరపడుతుండడం గమనార్హం.
ఎమ్మెల్సీ పోతుల సునీత తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అలాగే వైసిపి రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు కూడా పార్టీని వీడి తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం ఉంది. వీరి తర్వాత మరో ఆరుగురు వైయస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు కూడా ఆ పార్టీని వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నలుగురు ఎంపీలు తెలుగుదేశం లోకి, నలుగురు బిజెపిలోకి చేరుతారని చెప్పుకుంటున్నారు. తమాషా ఏమిటంటే ఇంకా పదవీకాలం ఉన్నప్పటికీ రాజ్యసభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసేస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు విధించిన కండిషన్ కారణంగానే వారు జగన్ ద్వారా దక్కిన పదవులను వదులుకొని చంద్రబాబు వద్దకు చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇది కచ్చితంగా నవతరం రాజకీయాలలో నైతిక విలువల ప్రమాణాలను స్థిరపరచడమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది నాయకుల వ్యక్తిగత హక్కు. వారి వ్యక్తిగత స్వేచ్ఛ తో ముడిపడి ఉంటుంది. తమ పార్టీ అనుసరిస్తున్న భావజాలం నచ్చనప్పుడు విడిపోయే అధికారం వారికి ఎప్పటికీ ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి దళం నుంచి ఒక్కసారిగా ఇంతమంది నాయకులు ఇతర పార్టీలలోకి వలసలు వెళుతున్నారంటే.. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నదో కదా అనే అనుమానాలు ప్రజలలో కలుగుతున్నాయి. భవిష్యత్తులో ఎవరు ఎలాంటి ఫిరాయింపులకు పాల్పడినా వచ్చి చేరే వారితో రాజీనామాలు చేయించాలనే నైతిక నిబంధన అప్రకటితంగా అమలులోకి వస్తుందని ప్రజల ఆశిస్తున్నారు.