చంద్రబాబు నాయుడును అసమాన తెలివితేటలు ఉన్న రాజకీయ దురంధరుడిగా ఆయన శత్రువులు కూడా గుర్తిస్తుంటారు. 44ఏళ్ల సీనియారిటీతో దేశంలోనే అత్యంత దిగ్గజ పొలిటీషియన్లలో ఒకరు ఆయన. సుదీర్ఘ అనుభవం నేర్పని పాఠాలతో చంద్రబాబునాయుడు పన్నే వ్యూహాలు అసమానమైనవిగా నిరూపణ అవుతూ ఉంటాయి. జనం నాడిని పసిగట్టడంలో.. ఏవిషయాన్ని ఎప్పుడు బయటపెట్టడం ద్వారా జనంలో ఎలాంటి స్పందన తీసుకురావచ్చునో.. చంద్రబాబునాయుడుకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియకపోవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. తన అనుభవం ద్వారా సాధించిన పరిణతిని ఆయన ఈ ఎన్నికల్లో మరోమారు నిరూపించుకున్నారు.
ఎన్నికలంటే కేవలం ప్రత్యర్థుల లోపాలను, తమ ఘనతలను ప్రచారం చేసుకుంటూ వెళ్లిపోవడం మాత్రమే కాదు. తాము కురిపించే వరాల జల్లు గురించి చాటిచెప్పుకోవడం మాత్రమే కాదు. ప్రతి విషయానికి కూడా రాజకీయాల్లో ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ తనకు తెలిసినట్టుగా సమకాలీన రాజకీయ నాయకుల్లో మరెవ్వరికీ తెలియదని చంద్రబాబు నిరూపించుకున్నారు. ఒకటిరెండు ఉదాహరణలు గమనిస్తే ఆ సంగతి మనకు ఇంకా బాగా అర్థమవుతుంది.
సూపర్ సిక్స్ హామీల విషయానికి వద్దాం. సాధారణ నాయకులు ఎవరైనా ఇలాంటి బోల్డ్ హామీలను ప్రకటించడానికి టైం తీసుకుంటారు. ప్రత్యర్థి పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల అయిపోయిన తర్వాత.. ఇంత చక్కటి హామీలను ప్రజల ముందుకు తెస్తారు. అంటే ఎన్నికలకు ముందుగానే ప్రకటిస్తారన్నమాట. కానీ అంత తక్కువ వ్యవధితో ప్రకటిస్తే.. అంత మంచి హామీలు రాష్ట్రంలోని మూలమూలలకు, ప్రతి గ్రామానికి, ప్రజల్లో ప్రతి ఒక్కరికీ చేరుతుందా లేదా అనే అనుమానం ఉంటుంది. అందుకే చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ఏడాది కిందట 2023 మహానాడులోనే వీటిని ప్రకటించారు. ఏడాదిరోజుల పాటూ వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి పార్టీ కార్యకర్తలు శ్రమించారు. ఆ ఫలితం కనిపించింది. మహిళలు, వృద్ధులు పెద్దసంఖ్యలో వచ్చి ఓటు వేశారు.
అలాగే పోలింగుకు ముందు తనను అరాచకంగా అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఏమేం జరిగిందో ప్రజలకు తెలియజెప్పడం ద్వారా చంద్రబాబునాయుడు సరైన టైంలో వారి సానుభూతిని సంపాదించగలిగారు. అలాంటిదే లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించిన ప్రచారం కూడా..! సరిగ్గా పోలింగుకు కొన్ని వారాల ముందునుంచి ఈ చట్టం గురించిన ప్రచారం ప్రారంభించారు. ప్రజల్లో దాని గురించి భయం పుట్టింది. ఆ చట్టాన్ని సమర్థించుకోలేక వైసీపీ వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చంద్రబాబు ఉధృతమైన ప్రచారంతో లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజల్లోకి వాస్తవాలు వెళ్లాయి. జగన్ ప్రభుత్వం పట్ల ఏవగింపు కలిగింది.
ఈ కోణాల్లోంచి చూసినప్పుడు చంద్రబాబు కేవలం సరైన అంశాలను సరైన టైమింగ్ లో ప్రయోగించి మంచి ఫలితం సాధించబోతున్నారని పలువురు అనుకుంటున్నారు.