తాను ముఖ్యమంత్రిగా ఉండగా రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లను నిందించడానికి జగన్మోహన్ రెడ్డి వద్ద ఒక ఆప్షన్ ఉండేది. ఆయన తరచుగా ఆ ఆప్షన్ ఉపయోగిస్తూ ఉండేవారు. ఆ ఆప్షన్ ఏంటంటే- ‘చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో సొంత ఇల్లు ఉంటున్న వాళ్ళు కాదు. మీరు గెలిపిస్తే ఇక్కడ ఉంటారేమో గెలిపించకపోతే వాళ్లు హైదరాబాదు వెళ్లిపోతారు’ అని పదేపదే జగన్ అంటూ ఉండేవారు.
ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అలాంటి పనే చేస్తున్నారు. ఆయన ఓడిపోయి కేవలం రెండు నెలలు మాత్రమే అయింది. అప్పుడే ఐదారుసార్లు బెంగళూరు ప్యాలెస్ యాత్ర పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. తాజాగా మళ్లీ బెంగుళూరు ప్యాలెస్ కి వెళ్ళిపోతున్నారు. రాష్ట్రంలో అల్లర్లు దాడులు హత్యలు ఎక్కడైనా జరిగితే బెంగళూరు ప్యాలెస్ నుంచి రావడం, రెండు రోజులు రంకెలు వేయడం.. ఆ గ్యాప్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకోవడం.. ఆ వెంటనే తిరిగి బెంగుళూరు వెళ్లిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి నిత్య కృత్యంగా మారింది.
విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే పార్టీ నాయకులతో భేటీలు కూడా ఆయనకు సహించడం లేదు. పార్టీ పునర్నిర్మాణ యాక్టివిటీ చురుగ్గా చేపట్టడం గురించి కూడా పట్టించుకోవడం లేదు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే వద్దన్నా కాదన్నా, అపాయింట్మెంట్లు ఉన్నా లేకపోయినా అక్కడికి వచ్చే కార్యకర్తల, నాయకుల జనాభా ఎంతో కొంత ఉంటుంది. అనివార్యంగా వారిని కలవాల్సి ఉంటుంది. అదే బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్ళిపోతే అక్కడ చీమ చొరబడడానికి కూడా అవకాశం లేదు. అంచెల వారీ భద్రత వ్యవస్థ ఆయన సొంతం. పార్టీ గురించి మాట్లాడడానికి బెంగళూరు ప్యాలెస్ దాకా వెళ్లడం ఎందుకు.. మళ్లీ జగన్ తాడేపల్లి వస్తారు కదా అప్పుడు మాట్లాడొచ్చు.. అని నాయకులందరినీ మభ్యపెడుతూ జగన్ అనుచరులు ఆయన ప్రైవసీని కాపాడుతారు. బెంగుళూరు ప్యాలెస్ కి వెళ్ళిపోతే యథేచ్ఛగా తన స్వకార్యాలు చక్కపెట్టుకోవడం జరుగుతుంది. అందుకే తాడేపల్లి కంటే బెంగళూరులో ఉండడానికే జగన్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదేపదే నిందించిన తీరు తనకు తెలుసు కనుక ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్లడానికి ఆయనకు ముఖం చెల్లడం లేదని.. పైగా అక్కడ తనను ఆదరించే కేసీఆర్ ప్రభుత్వం కూడా లేనందున ఛాన్స్ దొరికినప్పుడల్లా బెంగళూరు ప్యాలెస్ కు మాత్రమే వెళుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబును నిందించడం కాదు.. ఓడిపోయినప్పుడు తాను రాష్ట్రంలోనే ఉంటూ ఇక్కడి ప్రజలతో నిత్యం మమేకం అయ్యే సంగతిని జగన్ నిరూపించుకోవాలి కదా అని ప్రజలు అంటున్నారు.