జగన్మోహన్ రెడ్డికి రాచరికపు పోకడలు చాలా ఎక్కువ. రాజుల లాగా ప్రపంచం యావత్తు తన పేరిట వర్ధిల్లుతూ ఉండాలనే యావ ఎక్కువ. సాధారణంగా ప్రభుత్వంలో ఉండే నాయకులు వారి పార్టీలకు చెందిన పెద్దల పేర్లను వివిధ సంక్షేమ పథకాలకు కార్యక్రమాలకు కాలనీలకు పెడుతుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పేరు పెట్టుకోవడానికి అధికంగా ముచ్చట చూపించే వ్యక్తి. అయినా తన పేరిట ఏర్పాటు చేసిన మధ్యతరగతి ఇళ్ల కాలనీలను కూడా జగన్ విధ్వంసం దిశగా నడిపించారు. మధ్యతరగతి ఆదాయ వర్గాలకు ప్లాట్ల కేటాయించి వాటికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లు అని నామకరణం చేసి కొన్నింటిని విక్రయించిన తరువాత కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకుండా కొన్నవారికి ప్లాట్లు అప్పగించకుండా తనకు అలవాటైన విధ్వంసాన్ని కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి.
అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దారుణాలను కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమమే గనుక తెలుగుదేశం హయాంలో జరిగి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే, జగన్ తన ఐదేళ్ల పాలన కాలంలో ఆ కాలనీలు ఏవీ దిక్కు మొక్కు లేకుండా అలమటించి పోయేలాగా నిర్లక్ష్యం వహించి ఉంటారు- అనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ టౌన్షిప్ లకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. అంతకుమించి జగన్ తరహాలో సాంతం సర్వనాశనం చేయాలని ఈ స్మార్ట్ టౌన్షిప్ లు అన్నింటిని మరుభూములుగా మార్చేయాలని అనుకోలేదు. పైగా తాజాగా ఇక్కడ మౌలిక వసతులు కూడా కల్పించి కొనుగోలు చేసిన వారికి అందుబాటులోకి తేవడానికి సిద్ధం చేస్తున్నారు.
చంద్రబాబు హయాంలో పేదలకోసం 70 శాతానికి పైగా సిద్ధం చేసిన ఇళ్లను, జగన్ అధికారంలోకి వచ్చాక.. పూర్తి చేయకుండా, పేదలకు ఇవ్వకుండా వాటిని సర్వనాశనం చేశారు. తన దుర్బుద్ధిని ప్రదర్శించారు. కానీ.. చంద్రబాబునాయుడు మాత్రం అలాంటి దురాలోచనలు లేకుండా.. జగన్ చేసిన మధ్యతరగతి కాలనీల పథకాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.