రాజకీయాల్లో, ప్రత్యేకించి ఎన్నికల ప్రచార సమయాల్లో ఒక పార్టీ యొక్క సక్సెస్ ముందుగానే ఎక్కడ కనిపిస్తుందంటే.. వారి ఇచ్చిన హామీని.. అచ్చంగా లేదా అంతకంటె మెరుగ్గా కాపీ కొట్టడానికి ప్రత్యర్థి ప్రయత్నించినప్పుడు! అంతకంటె స్పష్టంగా చెప్పాలంటే.. ఒకరు ఇచ్చిన హామీని కాపీ కొట్టడానికి కూడా ప్రత్యర్థి భయపడుతున్నప్పుడు! ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఈ సిద్ధాంతానికి అనుగుణంగా కనిపిస్తున్నాయి. తాను చెప్పిన మాటలను మించి చెప్పడానికి గానీ, కౌంటర్ చేయడానికి గానీ వీలులేని అస్త్రాలను చంద్రబాబునాయుడు ప్రయోగిస్తున్నారు.
చంద్రబాబునాయుడు సోమవారం కుప్పంలో ఎన్నికల సభ నిర్వహించారు. ప్రజాగళం పేరుతో ప్రచారసభలు ప్రారంభం కావడానికి ఈనెల 27 ముహూర్తం అని ప్రకటించగా.. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ముందుగానే ఆయన సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబునాయుడు.. తనను వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటినుంచి అప్రతిహతంగా ఆదరిస్తున్న నియోజకవర్గం కుప్పం అని గుర్తుచేశారు. తెదేపా అభిమానుల్ని వేధిస్తున్నారని, జైళ్లలో పెట్టినా కూడా పార్టీ అభిమానులు బయటకు వచ్చాక జెండా పట్టుకుని తిరుగుతున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు.
పనిలో పనిగా ప్రత్యర్థులు చెప్పలేని ఒక వరాన్ని కుప్పంనుంచి చంద్రబాబు ప్రకటించారు. తమ ప్రభుత్వం రాగానే నాలుగువేల రూపాయల పెన్షన్ ను ఇళ్ల వద్దకే చేరుస్తాం అని ప్రకటించారు. చంద్రబాబు వస్తే.. అసలు పెన్షన్లు పూర్తిగా ఆగిపోతాయని వైఎస్సార్ కాంగ్రెస్ వాలంటీర్ల ద్వారా ఒక దుర్మార్గపు ప్రచారం చేయిస్తూన్న వేళ.. చంద్రబాబు.. పెన్షన్లను ఏకంగా నాలుగువేలకు పెంచడంతో పాటు, ఇళ్ల వద్దకే చేరస్తామన ప్రకటించడం ప్రత్యర్థులకు మింగుడపడని అంశం.
జగన్మోహన్ రెడ్డి రూ.4వేల పెన్షన్ హామీని ఇప్పుడు తాను ఇవ్వలేరు. ఎందుకంటే చంద్రబాబును కాపీ కొట్టినట్టుగా ఉంటుందని, ఆ క్రెడిట్ కూడా ఆయనకే పోతుందని భయం. అలాగని ఆ హామీ ఇవ్వకపోతే.. ప్రజలు చంద్రబాబునే ఆశీర్వదిస్తారని యింకోభయం. ఒక వేళం ఇప్పుడే నాలుగువేలు చేసేద్దాం అనుకుంటే.. అంతడబ్బు అప్పులు పుట్టించడం ఎలా అనే భయం.
చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాల పేరుతో డబ్బు పంచిపెట్టడం మాత్రమే కాదు. సంపద సృష్టించడం కూడా తెలిసిన నాయకుడు గనుక.. ఆయన ఇలాంటి హామీ ఇచ్చినా కూడా ప్రజలు నమ్ముతారని పలువురు విశ్లేషిస్తున్నారు.