పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యంత హాట్ హాట్ నియోజకవర్గాల్లో ఒకటి. జనసేనాని పవన్ కల్యాణ్ అక్కడినుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తుండడమే అందుకు కారణం. వారం రోజుల కిందటి వరకు పిఠాపురం గురించిన పెద్ద చర్చ లేదు. కాకపోతే, ఎప్పుడైతే పవన్ అక్కడినుంచి తానే పోటీచేస్తున్నట్టు ప్రకటించారో.. ఒక్కసారిగా ఆ ఊరు పతాక శీర్షికల్లోకి వచ్చేస్తోంది. మొన్నటివరకు మామూలు పరిస్థితులే కావడంతో అక్కడక ఎవరికి వారు పనిచేసుకుంటూ వచ్చారు. పవన్ పేరు తెరపైకి వచ్చాక అక్కడి టీడీపీ ఇన్చార్జి వర్మలోనూ, ఎంపీ వంగా గీతను అక్కడ అభ్యర్థిని చేసిన తర్వాత సిటింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబులోనూ అసంతృప్తి సహజంగానే పెల్లుబికింది. అయితే ఈ అసంతృప్తిని బుజ్జగించడంలో అటు చంద్రబాబు- ఇటు జగన్ లలో ఎవరు సక్సెస్ అయ్యారు. ఎవరు విఫలమయ్యారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం.
ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఇండిపెండెంటుగా నైనా పోటీచేస్తానని టీడీపీ నేత వర్మ ఆగ్రహించారు. ఆయన అనుచరులైతే ఏకంగా పార్టీ ఆఫీసులోనే విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో చంద్రబాబు వర్మకు ఫోను చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.
కానీ తర్వాత సీన్ మారింది. చంద్రబాబునాయుడు, అసంతృప్త నేత వర్మను ఉండవిల్లికి పిలిపించారు. మాట్లాడారు. ఎన్నికల తర్వాత తొలివిడత అవకాశంలోనే ఆయనను ఎమ్మెల్సీ చేస్తానని అన్నారు. వర్మ కూడా పరిస్థితిని అర్థం చేసుకుని వెళ్లారు. పవన్ పోటీచేయకపోతే తేడా కొడుతుందేమో గానీ, పవన్ పిఠాపురం ఎమ్మెల్యేగా బరిలో ఉంటే.. ఆయనను గెలిపించడానికి తన రక్తం చిందించి పనిచేస్తానని వర్మ చెబుతున్నారు.
అదే వైసీపీ పరిస్థితి ఏమిటి? సిటింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పక్కన పెట్టి ఎంపీ వంగా గీతకు అక్కడ అవకాశం ఇచ్చారు జగన్. అయితే పెండెంలో అసంతృప్తి ఉంది. ఆయన జనసేనలో చేరుతారనే పుకారు కూడా పుట్టింది. ఇండిపెండెంటుగా బరిలో దిగాలనే ఆలోచనతో ఉన్నట్టు కూడా ఒక ప్రచారం ఉంది. అయితే జగన్, దొరబాబును పిలిపించి మాట్లాడారు. ఎమ్మెల్యేగా తప్పించే ఉద్దేశం ఉంటే.. తనకు రాజ్యసభ ఎంపీ అవకాశం అయినా ఇవ్వాలని దొరబాబు గతంలో కోరితే పట్టించుకోని జగన్ ఇప్పుడు బుజ్జగించాలని చూశారు. పార్టీ విజయానికి పనిచేయాలని అన్నారు. దొరబాబు తిరగబడితే.. పార్టీకి గడ్డురోజులే అని జగన్ కు తెలుసు. అయితే ఈ బుజ్జగింపులు చంద్రబాబుకు చేతనైనట్లుగా జగన్ కు చేతకాలేదు. దొరబాబు , జగన్ దగ్గరినుంచి బయటకు వచ్చాక.. ‘వంగా గీతను గెలిపించాలని జగన్ చెప్పారు. అలాగేనన్నాను’ అని అన్నారే తప్ప.. మనస్ఫూర్తిగా పనిచేసే ఉద్దేశంతో లేరని గుసగుసలు వినిపిస్తున్నాయి.