ఉన్నత విద్య చదువుకోవడానికి పేద వర్గాలు ఎంతగా సతమతం అవుతుంటాయో చాలామందికి తెలియదు. సామాజిక వర్గాలపరంగా ప్రభుత్వం అండ లభించే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ అగ్రవర్ణాల ముద్ర ఉన్నప్పుడు, ప్రభుత్వ సహాయం అందడం కష్టం. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని విద్యార్థిలోకానికి ఒక అద్భుతమైన వరాన్ని ప్రకటిస్తున్నారు. అన్ని వర్గాల వారికి వర్తించేలాగా ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం అని చంద్రబాబు అంటున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని రాష్ట్రంలో విద్యారంగానికి ఊతమిచ్చే అద్భుతమైన హామీ ఇది అని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
ఈ పథకం కింద- ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి ప్రభుత్వం అవసరమైన రుణం ఏర్పాటు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందించే పావలా వడ్డీ రుణాల పథకంతో దీనిని అనుసంధానిస్తారు. అయితే వారి రుణంపై పడే పావలా వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. రుణం పొందిన విద్యార్థులు అసలు తీరిస్తే చాలు. పైగా అన్ని వర్గాల వారు పొందవచ్చు. అలాగే రుణం మంజూరు కోసం ఎలాంటి సెక్యూరిటీ అవసరం కూడా ఉండదు. 14 ఏళ్ల తర్వాత తిరిగి చెల్లించడానికి వెసులుబాటు ఉంటుంది. నైపుణ్య శిక్షణకు కూడా వర్తించేలాగా ఈ రుణాల మంజూరు ఉంటుంది. నిజంగా ఉన్నత విద్యారంగానికి ఇది గణనీయంగా మేలు చేస్తుందని చెప్పాలి.
చదువుకునే ఆసక్తి ఉన్నప్పటికీ కొన్ని లక్షల మంది పట్టభద్ర విద్యతో ఆగిపోతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. కుటుంబ ఆర్థిక స్థితిగతుల కారణంగా డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఏదో ఒక ఉద్యోగాలు వెతుక్కుని బతుకు తెరువు పోరాటం ప్రారంభించే వారు మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటారు. అలాంటిది ఉన్నత విద్య అభ్యసించడానికి వడ్డీ లేని రుణం ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా గొప్ప సంగతి అని చెప్పాలి. దీని వలన ప్రతి ఒక్కరూ అత్యుత్తమ విద్యా ప్రమాణాలను పొందగలగడం సాధ్యమవుతుంది. వడ్డీ లేకపోవడం మాత్రమే కాదు 14 ఏళ్ల తరువాత తిరిగి చెల్లింపులు ప్రారంభించే అవకాశం చిన్న వెసులుబాటు కాదు. ఎన్నికల హామీలలో చెప్పకపోయినప్పటికీ కూడా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కంకణబద్ధమై పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాల పట్ల ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
విద్యారంగానికి చంద్రబాబు ఏం చేశారు.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ లోని మీడియా పులులు.. మైకులు కనిపిస్తే రంకెలు వేస్తుంటాయి. ఏకపక్షంగా బురద చల్లడం తప్ప లాజిక్ లేకుండా మాట్లాడుతుంటారు. అలాంటి వారు ఉన్నత విద్య అభ్యసించే వారికోసం చంద్రబాబు చేస్తున్న ఈ అద్భుతమైన మేలు గురించి తెలుసుకుని మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.