మంత్రి పదవి అంటే ఎంతో బాధ్యతతో కూడినటువంటిది. ఏదో అధికార పదవి దక్కింది కదాని.. ప్రోటోకాల్ మర్యాదలు, వైభవం అనుభవించవచ్చు కదా అని మురిసిపోతే సరిపోదు. అలాగే ఎక్కడైతే బాధ్యత ఉంటుందో.. అక్కడ భయం కూడా ఉండాలి. అది చాలా బరువుగా కూడా ఉంటుంది. ఇదే విషయాన్ని తన సహచర మంత్రులకు స్వానుభవంలోకి తెస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. మంత్రులందరూ కూడా మరింత ఎక్కువగా కష్టపడి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా మంత్రులకు హోం వర్క్ కూడా అప్పగించేశారు.
బుధవారం నాడు ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. అనేక అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. భేటీ ముగిసిన తర్వాత.. మంత్రులతో చంద్రబాబు నాయుడు వివిధ అంశాలమీద సుదీర్ఘంగా చర్చించారు. ఒక రకంగా చెప్పాలంటే వారికి క్లాస్ తీసుకున్నారు. ‘మంత్రులు ఏడాదిగా సబ్జెక్టు నేర్చుకుంటూ మెరుగ్గా పనిచేశారు. ఇక హనీమూన్ కాలం ముగిసినట్టే. పాలనలో వేగం పెంచాలి’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రులు తమ శాఖలపై మరింతగా పట్టు పెంచుకోవాలని చంద్రబాబు అంటున్నారు. తమ తమ శాఖలపై ప్రాజెక్టు రిపోర్టులు కూడా సొంతంగా తయారు చేసుకోవాలని వారికి స్పష్టమైన గైడెన్స్ ఇవ్వడం గమనార్హం. వచ్చే కేబినెట్ భేటీ సమయానికి ప్రతి మంత్రితో వారి శాఖ గురించి మాట్లాడిస్తానంటూ చంద్రబాబు టార్గెట్ కూడా విధించారు.
అంటే మంత్రులు ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే. ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసుకోవడం అంటే.. ఒకవేళ చంద్రబాబు దాన్ని అడుగుతారనే భయం ఉన్నప్పటికీ అధికార్లతో తయారుచేయించుకునే అవకాశం ఉంది. అయితే.. చంద్రబాబు అంతకంటె ఒక అడుగు ముందుకు వేసి.. మంత్రులతో నెక్ట్స్ కేబినెట్ భేటీలో మాట్లాడిస్తానని అంటున్నారు. ఇదే జరిగితే గనుక మంత్రులు ఖచ్చితంగా సొంతంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అంటే వారు ఇన్నాళ్లు ఎలా గడిపారో గానీ.. ఇప్పుడు తమ తమ శాఖల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా.. తమ శాఖల గురించి ఇచ్చే ప్రెజంటేషన్ లో చంద్రబాబు వద్ద మైనస్ మార్కులు పడే ప్రమాదం ఉందని వారిలో గుబులు మొదలైంది.
ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో మొదటిసారి మంత్రులు అయిన వారు చాలా మందే ఉన్నారు. పవన్ కల్యాణ్ కూడా తొలిసారి మంత్రి. ఆయన మంత్రి అయిన నాటినుంచి.. ఆ శాఖ మీద పట్టుపెంచుకోడానికి రాత్రింబగళ్లు శ్రమించారు. ఫైల్స్ స్టడీ చేశారు. అధికారులతో మాట్లాడుతూ.. బేసిక్ సంగతుల నుంచి ప్రతి విషయం కూలంకషంగా తెలుసుకున్నారు. మంత్రిగానే కాకుండా డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా సమర్థంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మంత్రులందరూ కూడా అదే మాదిరిగా పట్టు పెంచుకునే దిశగావారితో చంద్రబాబు హోంవర్క్ చేయించడానికి డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది.