ఏ విషయాలలో అయితే విచ్చలవిడి అవినీతికి పాల్పడడం ద్వారా వైయస్ జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టిపోయారో, ప్రజల దృష్టిలో అపకీర్తిని మూటగట్టుకున్నారో.. ఆ విషయాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఫలితంగా రాష్ట్రంలో లిక్కర్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలో ఎమ్మార్పీ ధరలను విపరీతంగా పెంచి, పెంచిన ధరలను ఆ కంపెనీల నుంచి అడ్డదారిలో కాజేసిన ప్రభుత్వ పెద్దల దుర్మార్గపు పోకడలు ఇప్పుడు లేకపోవడంతో మద్యం ధరలను మరింతగా తగ్గించడానికి కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. ఎన్నికల ప్రచారం సమయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారో.. ఆ హామీకి కార్యరూపం లాగా మద్యం ధరల తగ్గింపు జరుగుతోంది.
జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఒక్క ఛాన్స్ అందించినప్పుడు ఇసుక, మద్యం రూపంలో ఆయన విచ్చలవిడి సంపాదనకు వక్రమార్గాలను సృష్టించుకున్నారు. ఎడాపెడా దోచుకోవడానికి అనుకూలంగా ఈ రెండు వ్యాపారాలలో ఎలాంటి డిజిటల్ చెల్లింపులకు కూడా అవకాశం లేకుండా దోపిడీ పర్వం యదేచ్చగా సాగింది. సర్కారీ ప్రభుత్వ దుకాణాలు అనే ముసుగులో సంఘాలు నడిపిస్తూ ఒకవైపు మద్యం తయారీ కంపెనీలను తమ పార్టీ వారి బినామీల ద్వారా చేజిక్కించుకుని, ఆ కంపెనీల ద్వారా ఎంఆర్పి ధరలను విపరీతంగా పెంచి, పెంచిన ధరలను అడ్డదారుల్లో తామే కాజేస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త అవినీతి పర్వానికి తెర తీశారు. ఒక్క లిక్కర్ వ్యాపారం ద్వారానే జగన్ మరియు ఆయన సహచర వైసిపి అగ్ర నాయకులు కలిపి 50 వేల కోట్ల రూపాయలకు పైగా కాజేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అవినీతికి అడ్డుకట్ట వేసి.. లిక్కర్ ధరలను అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సందర్భంలోనే ప్రకటించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 10 బ్రాండ్ల ధరలను తగ్గించారు. ఇప్పుడు మరో ఆరు కంపెనీలు లిక్కర్ ధరలను తగ్గించడానికి ప్రభుత్వానికే దరఖాస్తు చేసుకున్నాయి. ఐదేళ్లపాటు అడ్డగోలు ఎంఆర్పి ధరలతో ప్రజలను దోచుకున్న ఇవే బ్రాండ్లకు కంపెనీలు ఇప్పుడు ఒక క్వార్టర్ బాటిల్ పై 20 నుంచి 80 రూపాయల వరకు తగ్గిస్తామని, అందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరడం తమాషా! జగన్ కు చెల్లించే జే టాక్స్ లేకపోవడం వలన కంపెనీల వారు ఎంఆర్పి తగ్గించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎక్కడైనా సరే సంవత్సరాలు గడిచే కొద్దీ ధరలు పెంచుకుంటూ పోతారు గాని.. ధరలు తగ్గించేందుకు మద్యం కంపెనీలన్నీ క్యూ కట్టే ప్రభుత్వాన్ని కోరుతూ ఉండడం పట్ల ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలు అడగకపోయినాప్పటికీ కూడా ప్రభుత్వం ఆ ధరలను పెంచేసింది. పెంచిన ధరలను అడ్డదారుల్లో జగన్ తాడేపల్లి ప్యాలెస్ వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తీరా ఇప్పుడు అలాంటి ప్రైవేటు వసూళ్లు లేకపోవడం కారణంగా కంపెనీలు కూడా తమ తీరు మార్చుకుంటున్నాయి. ఆల్రెడీ 10 కంపెనీల లిక్కర్ ధరలు తగ్గించిన తర్వాత వ్యాపార పరంగా పోటీ తప్పకపోవడంతో మిగిలిన కంపెనీలన్నీ కూడా ధర తగ్గించడానికి ముందుకు వస్తున్నట్లుగా సమాచారం!