ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి వెళ్లారు. అయితే ఈ పర్యటన ఎంతో కీలకమైనది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైనది^ అని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే ఈనెల 23వ తేదీన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉదారంగా సాయం అందించాలని.. రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి పథంలో పయనించడానికి, ఆర్థికంగా తన కాళ్ళ మీద నిలబడడానికి తగిన విధంగా తోడ్పాటు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కేంద్రంలోని పెద్దలను కోరుతున్నారు. మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లగానే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో ఆయన నివాసంలో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. అమరావతి పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపేలా బడ్జెట్ లో నిధులు విడుదల చేయాలని ఆయన కోరినట్లుగా సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ధ్వంసమైన రహదారులను బాగు చేసేందుకు నిధులు కావాలని అలాగే అమరావతి రాజధానిని జాతీయ రహదారులతో అనుసంధానించడంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు జాతీయ రహదారుల ప్రాజెక్టులను కేటాయించాలని కూడా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతున్నారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా ఈ బడ్జెట్ లోనే గణనీయమైన ముందడుగు పడేలాగా ఆయన విన్నవిస్తున్నారు.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కు చంద్రబాబు ఆల్రెడీ కేంద్రంనుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారు. దీనిని పూర్తిగా కేంద్రమే నిర్మించేలా ఆల్రెడీ ప్రకటన వచ్చింది. అయితే ఈ బడ్జెట్ లోనే దానికి కూడా నిధులు కేటాయించాలని చంద్రబాబు కోరుతున్నారు. అదే జరిగి, ఈ ఏడాదిలో.. అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన సన్నాహాలు, పనులు మొదలైతే చాలు… అమరావతి నగర నిర్మాణం మహా జోరందుకుంటుందని అంతా అంచనా వేస్తున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం అధినేత.. కేంద్రాన్ని మెడలు వంచి రాష్ట్రానికి కావలసిన ప్రయోజనాలు నెరవేర్చుకు వస్తా అని దుందుడుకు ధోరణిని ప్రదర్శించడం లేదు. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా మాత్రమే.. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలని అనుకుంటున్నారు. తెలుగుదేశం కంటే తక్కువ మంది లోక్ సభ ఎంపీలను కలిగి ఉన్న బీహార్లోని జెడియు, కేంద్రాన్ని బెదిరించే ధోరణిలో మాట్లాడుతూ ఉండగా.. చంద్రబాబు నాయుడు మాత్రం చాలా సానుకూల ఆశావహ దృక్పథంతో కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధిని తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల నాటికి గతంతో పోలిస్తే ఏ కొంత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు పెరిగినా.. అది కేవలం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న లౌక్య రాజనీతి ద్వారా మాత్రమే సాధ్యమైనట్లుగా భావించాల్సి ఉంటుంది.