కొలికపూడిపై చంద్రబాబు గుస్సా !

అధికారులకు ఫిర్యాదు చేసినా కూల్చివేతల విషయంలో పట్టించుకోలేదు అని ఆగ్రహించి, తనే స్వయంగా జేసీబీలను తీసుకువెళ్లి నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేయించేందుకు ప్రయత్నించిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం విమర్శల పాలయ్యేలా ప్రవర్తించిన ఆయనను పిలిపిపించుకుని మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి గానీ.. చంద్రబాబు కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. 
ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని చట్టాన్ని నిబంధనలను ప్రభుత్వ వ్యవస్థను గౌరవించడం నేర్చుకోవాలని చంద్రబాబు నాయుడు కొలికపూడి శ్రీనివాసరావుకు హితోపదేశం చేసినట్లుగా సమాచారం. అయితే కొన్ని మాత్రం అన్యాయానికి గురైన ప్రజలకు మేలు చేయలేకపోతే నాకు ఇక పదవి ఎందుకు అని అంటున్నారట.

 తన నియోజకవర్గ పరిధిలోని గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తూ ఉంటే ఎమ్మెల్యే కొలికపూూడి శ్రీనివాసరావు తన మనుషులతో వెళ్లి ఆ భవనాన్ని పాక్షికంగా కూల్చి వేయించారు. ఈలోగా అక్కడికి అధికారులు వచ్చి ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని ఖాతరు చేయలేదు. ఆయన సాగిస్తున్న కూల్చివేతలను ఆపడానికి అధికారులు చాలా ప్రయాస పడాల్సి వచ్చింది. అయితే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన అతి సర్వత్రా విమర్శల పాలైంది.

చంద్రబాబు నాయుడు కూడా ఆయనను ప్రత్యేకంగా పిలిపించి మందలించినట్లుగా సమాచారం. ప్రజాస్వామ్యబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు అది బాధ్యత అవుతుందని, అందరూ మనల్ని రోల్ మాడల్ గా భావించేలా పనిచేయాలి తప్ప.. విమర్శలు చేసేలా కాదని చెప్పినట్టు తెలుస్తోంది.  అందరికంటే ముందు చట్టాన్ని అధికార వ్యవస్థను గౌరవించడం నాయకులే నేర్చుకోవాలని చంద్రబాబు చెప్పారట. ఇలా ‘ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు’ అనే ముసుగులో కర్ర పెత్తనం చేస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధనీయం కాదని చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి నాయకుల వైఖరి వలన పార్టీ నష్టపోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నెలరోజుల్లోనే ఇద్దరి వ్యవహార సరళి ప్రభుత్వాన్ని విమర్శల పాల్జేసింది. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత పోలీసుల పట్ల చూపించిన దురుసుతనం విమర్శల పాలుకాగా, ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు వైఖరి కూడా అలాగే అయింది. 

Related Posts

Comments

spot_img

Recent Stories