తనను ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధిస్తున్నప్పటికీ కూడా.. ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి సర్కారు అరాచకత్వం మీద అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన వ్యక్తి రఘురామక్రిష్ణ రాజు. ఎన్నికల తరుణం ముంచుకు వచ్చేదాకా.. ఆయన ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోలేకపోవడం, అన్ని పార్టీలతోనూ ఆయనకు సమానమైన సత్సంబంధాలు ఉండడం ఇలాంటివి కారణాలు ఏమైతేనేం.. టికెట్లు ప్రకటించే సమయానికి రఘురామకు ఆశించిన చోట ఆశించిన అభ్యర్థిత్వం దక్కలేదు. ఆయన హతాశులయ్యారు. చంద్రబాబునాయుడు మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఆశించినట్టుగానే.. ఎట్టకేలకు చంద్రబాబునాయుడు ఆయనను పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. ఆ ఉండి సెగ్మెంటు ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నరసాపురం ఎంపీ నియోజకవర్గ పరిధిలోనిదే కావడం గమనార్హం.
ఉండి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా విజయాన్ని అందించగల నియోజకవర్గంగా గుర్తింపు ఉంది. 2019లో కూడా ఇక్కడ మంతెన రామరాజు తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా బాబు ఆయనకే టికెట్ ప్రకటించారు. అయితే.. రఘురామకు ఎదురైన క్లిష్ట పరిస్థితి నేపథ్యంలో ఈ మార్పు జరిగింది.
మంతెన రామరాజుకు ముందుగా సర్దిచెప్పిన తర్వాతనే.. చంద్రబాబునాయుడు రఘురామకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించినట్టుగా తెలుస్తోంది. రఘురామక్రిష్ణ రాజు వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారే గానీ.. ఆ పార్టీ పోకడలతో విభేదించడంతో గత అయిదేళ్లుగా పార్టీ ఆయనను టార్గెట్ చేస్తూ వచ్చింది. ఆయన కూడా వారి ఒత్తిడులకు, బెదిరింపులకు లొంగలేదు. ఆయనమీద వివిధ కేసులు బనాయించి సీఐడీ అధికారులతో అరెస్టు చేయించారు.
ముసుగులు వేసుకున్న పోలీసులు తన మీద హత్యాయత్నం చేశారని, దారుణంగా కొట్టారని, చంపడానికి ప్రయత్నించారని రఘురామ ఆరోపించడం కూడా జరిగింది. చివరికి ఆయన సొంత బామ్మ చనిపోయినా కూడా స్వగ్రామానికి రాలేకుండా తన మీద నిఘాగా పోలీసులను మోహరించారని రఘురామ చెప్పుకున్నారు. జగన్ పాలనలో అన్ని ఇబ్బందులు పడినప్పటికీ.. ఆయనకు తాను ఆశించిన ఎంపీ టికెట్ మాత్రం దక్కలేదు. కాగా.. సుదీర్ఘమైన తర్జన భర్జనల తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్ష ఎన్నికల్లోనే పోటీచేయాలనే ఆయన కోరిక మేరకు చంద్రబాబునాయుడు ఉండి నియోజకవర్గాన్ని కేటాయించారు.