జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో.. అన్ని రకాల వ్యవస్థలను కూడా పణంగా పెట్టి అందిన కాడికి డబ్బులన్నీ పథకాలకు తరలించిన నాయకుడు. ఆయన అసమర్థ పరిపాలన విధానాలకు నిర్వీర్యం అయిపోయిన రంగాలలో స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి. స్థానిక సంస్థలకు అందవలసిన నిధులన్నిటినీ కూడా పక్కకు మళ్లించిన తీరు ఆయనది. ఆ సంస్థల ఆర్థిక నిర్మాణం కుప్పకూలి పోయింది. అలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో ఇది కూడా ఒక ప్రధాన హామీ గా ప్రకటించారు. ఇప్పుడు తను అధికారం లోకి రాగానే.. స్థానిక సంస్థలను ఆర్థికంగా పరిపుష్టం చేసే దిశగా వాటికి నిధులు విడుదల చేయడం జరిగింది.
రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నియమితులైన పయ్యావుల కేశవ్ మిగిలిన వారి కంటే కాస్త ఆలస్యంగా గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఆ వెంటనే స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆ రకంగా ఆర్థిక శాఖ పరంగా కూడా.. ఇచ్చిన ఎన్నికల హామీని ఘనంగా నిలబెట్టుకున్నట్లయింది.
స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను పయ్యావుల కేశవ్ విడుదల చేశారు. దీనితో సుమారు 250 కోట్లు స్థానిక సంస్థలకు విడుదల అయినట్టు అయింది. ఈ సంస్థల సొమ్మును జగన్ పక్కదారి పట్టించి.. నిర్వీర్యం చేశారో.. అవే సంస్థలకు తిరిగి జవ జీవాలు ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ, పాలన యంత్రాంగంలోని అన్ని సంస్థలను ముంచేసి.. పథకాలు చాలు అన్నట్టుగా జగన్ వ్యవహరించారు. సంక్షేమంతో పాటు.. అన్ని వ్యవస్థలను కాపాడే పని చంద్రబాబు చేస్తున్నారు.