సోషల్ మీడియా అనేది ఇవాళ్టి సమాజానికి అంది వచ్చిన ఒక అతి గొప్ప అస్త్రం. కేవలం మనకు కావలసిన వారితో నిత్యం టచ్ లో ఉంటూ మానవ సంబంధాలను కొనసాగించడానికి మాత్రమే కాదు. ప్రపంచంలో ఏ వ్యవహారం పైన అయినా సరే మన మన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తూ ఏకాభిప్రాయం ఉన్న వారితో జత కలవడానికి ఒక సాంఘిక ఉద్యమ టూల్ లాగా ఇవాళ సోషల్ మీడియా ఉపయోగపడుతూ వస్తోంది. అయితే ఇదే సోషల్ మీడియాను రాజకీయ దుర్మార్గాల కోసం, స్వార్ధ ప్రయోజనాల కోసం, ప్రజలలో భయాలను అపోహలను పెంచే తప్పుడు ప్రచారాల కోసం ఉపయోగించడం కూడా జరుగుతోంది. సోషల్ మీడియా వినియోగం అదుపుతప్పి వెర్రి తలలు వేస్తే సమాజం మొత్తం దారితప్పి పోతుందనే భయం కూడా పలువురిలో కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో సోషల్ మీడియాలో అబద్ధాలు, తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా, ప్రజలు తప్పుదారి పట్టకుండా ఉండేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వ్యక్తిగతంగా తమను టార్గెట్ చేసి తిట్లు, దూషణలు సాగించినంత కాలమూ కూడా.. చంద్రబాబునాయుడు, నారా లోకేష్ తదితరులంతా అలాంటి పోకడలను రాజకీయంగానే ఎదుర్కొంటూ వచ్చారు. కానీ.. సోషల్ సైకోలు.. రాష్ట్రం గురించి అబద్ధాల ప్రచారానికి, రాష్ట్రప్రజల్ని భయపెట్టడానికి ఇలా చేస్తుండడంతో చంద్రబాబు ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. కొత్త చట్టాలతో కత్తి ఝుళిపించాల్సిందే అంటున్నారు.
నిజానికి సోషల్ మీడియాను కట్టడి చేయడం గురించి వివిధ ప్రభుత్వాలు తమ తమ స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే రాజకీయ దురుద్దేశాలతో ప్రజలలో గందరగోళం సృష్టించడం వర్గాలు ప్రాంతాల మధ్య విభేదాలు ప్రేరేపించడం ప్రభుత్వ విధానాలు కార్యక్రమాలపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడం లాంటివి లక్ష్యంగా పనిచేసే వారిని కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి ఫేక్ వార్తల కట్టడికి ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. హోం మంత్రి అనిత, పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్ ఈ క్యాబినెట్ సబ్ కమిటీ లో ఉండి ప్రతిపాదనలను రూపొందిస్తారు. సోషల్ మీడియా ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేయడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయగలమా? అనే నిబంధనల గురించి వీళ్ళు కసరత్తు చేస్తారు. అలాగే తప్పులు చేస్తున్న వారికి ఎలాంటి శిక్షలు ఉండాలో కూడా మీరు నివేదిక తయారు చేస్తారు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ దేశ ప్రజలకు అవసరమేనని, అయితే ఆ ముసుగులో రాజకీయ దుర్మార్గాలకు అవకాశం కల్పించకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో వర్షాలకు అమరావతి ప్రాంతం మొత్తం మునిగిపోయినట్లుగా, యూరియా కొరత గురించి అనేక అబద్దాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి తేవడం పర్యవసానంగా ప్రభుత్వం ఈ కసరత్తు ప్రారంభించింది. పటిష్టమైన చట్టాలు వస్తే అబద్ధాలు ప్రచారం చేసేవారికి ముకుతాడు సాధ్యమవుతుందని పలువురు అంటున్నారు.