అమరావతి చుట్టూ ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపి చాలాకాలం అయింది. అయితే.. వారి ఆమోదంతో చంద్రబాబు సమాధానపడలేదు. ఓఆర్ఆర్ ప్రతిపాదనలు తయారుచేసి పంపినప్పుడు.. 140 మీటర్ల వెడల్పు అవసరం లేదని.. 70 మీటర్లు చాలునని అంత వరకే పనులు చేపట్టాలని కేంద్రం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదు. అమరావతిని దేశంలోనే అత్యున్నతమైన నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడానికి దృఢసంకల్పంతో పనిచేస్తున్న బాబు.. ఈ మేరకు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు.
వారి ఆమోదం వచ్చిన సమయంలోనే.. అలాకాదు మళ్లీ కేంద్రంతో సంప్రదించాలని అధికార్లను పురమాయించారు. మొత్తానికి తాజాగా 140 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ పనులు చేపట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది కేవలం చంద్రబాబునాయుడు పట్టుదల సాధించిన విజయం అని ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి నగరానికి 140 మీటర్ల వెడల్పుతో 189 కిలోమీటర్ల పొడవైన ఓఆర్ఆర్ ఏర్పడనుంది. దీని నిర్మాణం అమరావతి నగర పురోగతి విషయంలో ఒక కీలక మలుపు అవుతుందని.. అవుటర్ మార్కింగ్ జరిగిన వెంటనే.. ఆ హద్దు వరకు అన్ని రకాల ప్రెవేటు నిర్మాణాలు కూడా జోరందుకుంటాయని పలువురు అంచనా వేస్తున్నారు.
అమరావతి ఓఆర్ఆర్ మీద రాబోయే యాభయ్యేళ్లలో పెరిగే వాహన రద్దీని కూడా దృష్టిలో ఉంచుకుని ఇప్పుడే నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు కేంద్రం వద్ద పట్టుపట్టారు. మొత్తానికి కేంద్రం ఆమోదం సాధించారు. ఈ ఓఆర్ఆర్ నిర్మాణం కోసం చేపట్టే భూసేకరణకు రాష్ట్రప్రభుత్వం తమ వాటాగా వెయ్యి కోట్లరూపాయలు ఇస్తుంది.
అమరావతి ఓఆర్ఆర్ తో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపట్టవలసిన అనేక ప్రాజెక్టులకు కూడా తాజాగా ఆమోదం లభించింది. గుంటూరు నుంచి వినుకొండవరకు హైవే విస్తరించడానికి, మూలపేటనుంచి విశాఖకు గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ హైవే ఏర్పాటు చేయడానికి, విశాఖలో ఒకే ప్రాజెక్టుగా మెట్రోను, హైవేను నిర్మించడానికి ఇంకా అనేక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
వీటికోసం ఈ ఏడాది మార్చిలోనే సీఎం చంద్రబాబునాయుడు కేంద్రమంత్రి గడ్కరీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్రాభివృద్ధిలో ఇవెంత కీలకమో వివరించారు. మొత్తానికి ఇన్నాళ్లకు ఏపీ ప్రభుత్వ ప్రతిపానదలు అన్నింటికీ కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తమై.. అధికారిక నిర్ణయాలు వచ్చాయి.