వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో విచ్చలవిడిగా చెలరేగిపోయిన మరో అవినీతి తిమింగలం ఇప్పుడు కటకటాల వెనక్కు వెళ్లే సంకేతాలు అందుతున్నాయి. గత ప్రభుత్వ కాలాంలో జరిగిన భారీ దోపిడీ పర్వాలలో మరొక దానిపై పోలీసులు ప్రాథమిక విచారణ పూర్తిచేశారు. విజిలెన్స్ విభాగం తరఫు నుంచి మరికొన్ని రోజుల్లోగా తమ విచారణ నివేదికను డీజీపీకి సమర్పించనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నివేదిక అందితే గత ప్రభుత్వకాలంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని కోట్లు స్వాహా చేసిన కొత్త అవినీతి పరుల బాగోతాలు వెలుగులోకి వస్తాయి. అందుకే.. అప్పట్లో కొన్నాళ్లు మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే- ఈ అవినీతి కుంభకోణం.. అప్పట్లో ఆమె ప్రాతినిధ్యం వహించిన క్రీడామంత్రిత్వ శాఖ పరిధిలోని ‘ఆడుదాం ఆంధ్రా’ అనే కార్యక్రమానికి సంబంధించినది!
జగన్ సర్కారు పాలన సాగుతున్న రోజుల్లో రాష్ట్రంలో క్రీడారంగాన్ని సముద్ధరించేస్తున్నట్టుగా ఒక బిల్డప్ ఇచ్చారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో పోటీలు నిర్వహించారు. అందుకోసం రాష్ట్రంలో పలుచోట్ల స్టేడియంలు కూడా సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వం ఏకంగా 120 కోట్ల రూపాయలు కేటాయించగా… స్పాన్సర్ల నుంచి కూడా నిధులు సేకరించారు. ఆ రూపేణా స్పాన్సర్లనుంచి దాదాపు 500 కోట్ల రూపాయలు సేకరించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ మొత్తం నిధులను ఖర్చు చేయడం భారీగా అవకతవకలు, అవినీతి జరిగినట్టుగా అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. నాసిరకం క్రీడా పరికరాలు ఇచ్చారని, స్టేడియంలు రెడీ చేయడం పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. పులివెందులలోనే 6 కోట్లతో పూర్తయ్యే క్రీడా మైదానానికి 20 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అక్రమాలు అనేకం. వందల కోట్లలో ఈ మొత్తం కార్యక్రమంలో దోచుకున్నట్టుగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి రోజా, ఇంకా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కలిసి పంచుకున్నట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ముసుగులో జరిగిన అరాచకాలు, దోపిడీ గురించి విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ స్కామ్ పై విచారణ పూర్తయినట్టుగా.. నేడో రేపో అధికారులు డీజీపీకి నివేదిక ఇవ్వబోతున్నట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగం సమస్తం రాబట్టినట్టు తెలుస్తోంది. జగన్ సీఎం అయిన తర్వాత తొలివిడతలో అవకాశం దక్కని రోజాకు మలివిడతలో మంత్రిపదవి లభించింది. టూరిజంతోపాటు, క్రీడల శాఖ కూడా చూశారు. ఆమె పాలనలోనే ఈ అవినీతి దందా మొత్తం చోటుచేసుకుంది. పరికరాలు కొనుగోలు, ముగింపు ఉత్సవాలు అన్నింటినీ దోపిడికీ వీలుగా మార్చుకున్నారని విమర్శలొచ్చాయి. ఈ నివేదిక డీజీపీకి అందిన తర్వాత.. రోజా కూడా అరెస్టు కావడం గ్యారంటీ అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.