ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంచుమించుగా ఐదేళ్లలో 50 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ స్కాం దర్యాప్తులోకి కేంద్ర సంస్థలు సిబిఐ, ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రవేశించనున్నాయా? ఇప్పటికే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన మూలాలను వెలికి తీయడానికి ఏపీ సిఐడి రంగంలోకి దిగిన నేపథ్యంలో.. అనేక వర్గాల నుంచి వెల్లువెత్తుతున్న డిమాండ్లు, ఫిర్యాదుల ప్రకారం కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి రానున్నాయని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఈ మొత్తం మద్యం కుంభకోణానికి అసలు సూత్రధారిగా, అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా బయటకు వస్తుందని అంచనాలు సాగుతున్నాయి.
సంపూర్ణ మధ్య నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టగానే ఏం చేశారో అందరికీ తెలుసు. దశలవారీ మధ్య నిషేధం అనే ముసుగులో దుకాణాలను ప్రభుత్వం నిర్వహించేలా ఒక కొత్త విధానం తీసుకువచ్చారు. ఇదే అతి పెద్ద కుంభకోణంగా ఇప్పుడు వెలుగు చూస్తోంది. మరొకవైపు మద్యం తయారీ రంగాన్ని కూడా పూర్తిగా తన బినామీల గుప్పిట పెట్టుకున్నారు. అప్పటికే మద్యం తయారుచేసే బ్రూవరీస్ యజమానులను బెదిరించి వైసిపి కి చెందిన అగ్ర నాయకులు బినామీలపేరిట చేజిక్కించుకున్నారనే ఆరోపణలున్నాయి. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లకు సంబంధించిన బినామీలు పేరిట కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని బ్రూవరీస్ ను అనధికారికంగా తమ గుప్పిట్లోకి తెచ్చుకుని దందా నడిపించినట్టు కూడా వినిపిస్తోంది. అలా తయారీ రంగాన్ని వారి పార్టీ నాయకులే చేజిక్కించుకోగా వారికి మాత్రమే వేలకు వేల కోట్ల రూపాయల ఆర్డర్లను ప్రభుత్వం వైపు నుంచి కట్టబెడుతూ వచ్చారు. ఆయా జె బ్రాండ్ల తయారీ ఖర్చు అత్యల్పం కాగా, మార్కెట్లో భారీ రేట్లు పెట్టి అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాల్లో వాస్తవాలను నిగ్గు తేల్చడానికి త్వరలోనే సీబీఐ, ఈడీ రంగప్రవేశం చేయనున్నట్టు సమాచారం.
వాసుదేవ రెడ్డి మీద దర్యాప్తు మొదలైన తర్వాత ఒక్కొక్క విషయం వెలుగు చూస్తోంది. మొత్తం వ్యవహారం మిధున్ రెడ్డి కనుసన్నల్లోనే నడిచినట్లుగా లోగుట్టు బయటకు వస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం సుమారుగా 100 నుంచి 500 కోట్ల రూపాయల విలువైన కుంభకోణం జరిగినందుకే ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి సహా తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కటకటాలు లెక్కిస్తున్నారు. ఏపీలో వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం గుట్టుమట్టులన్నీ బయటకు వస్తే.. జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల్లో పీకల్దాకా కూరుకుపోతారని అంచనాలు సాగుతున్నాయి.