వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి ఛానెల్ లో.. నిత్యం ఎలాంటి చర్చలు నడుస్తుంటాయో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడును దూషించడం తప్ప వారికి మరొక అజెండా ఉండదు. చూసేవారికి చర్చ కొంచం పారదర్శకంగా కనిపించడానికి కూడా.. వారు ఇతర పార్టీలకు చెందిన వారిని ఆ చర్చలకు పిలవరు. తటస్తులను కూడా పిలవరు. ఇంకోరకంగా చెప్పాలంటే.. తటస్తులు ఎవ్వరూ సాక్షి చర్చలకు వెళ్ళరు కూడా. ఆ చానెల్ లో కనిపిస్తే చాలు.. తమ మీద జగన్ భట్రాజులు అనే ముద్ర పడిపోతుందని వారికి భయం. అలాంటి సాక్షి ఛానెల్ కు ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మంత్రి సత్యకుమార్ వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన గురించి చర్చించడానికి, సాక్షి ఛానెల్ లో చర్చకు కూర్చోవడానికి తాను వస్తానని సత్యకుమార్ అంటున్నారు. మరి ఆ సవాలును స్వీకరించే దమ్ము ఆ చానెల్ కు ఉందో లేదో తెలియడంలేదు.
మాములుగా సాక్షి చర్చ కార్యక్రమాలకు మామూలు విశ్లేషకులు రావడం ఎన్నడో ఆగిపోయింది. కేవలం పార్టీ నాయకులు మాత్రమే వచ్చి, చంద్రబాబు మీద బురద చల్లడమే తమ జీవిత ఆశయంగా బతుకుతున్నారు. పైగా రేపు చర్చకు రాబోయే వారికి.. ముందుగానే ఏ అంశాల మీద చర్చ ఉంటుందో సమాచారం ఇచ్చి, ఎలా మాట్లాడాలో బ్రీఫింగ్ ఇచ్చి వారియో తిట్టించడం సాక్షి అలవాటు.
టీడీపీ, జనసేన పార్టీల వాళ్ళు చర్చలకు వెళ్లకుండా వెలివేసిన ఆ చానెల్ కు మంత్రి సత్యకుమార్ వస్తానని అనడం లడ్డు లాంటి అవకాశం అని చెప్పాలి. పోటుగాళ్లు అనుకుంటున్న తమ ప్యానెలిస్టులను అందరినీ మోహరించి.. సత్యకుమార్ ను నిలదీయవచ్చు. కూటమి ఏడాది పాలనపై చర్చిస్తానని ఆయన అంటున్నారు. ఆ సవాలును స్వీకరిస్తే,. సత్యకుమార్ పై పైచేయి సాధించి కూటమి విఫలమైనట్టుగా సాక్షి చెప్పినట్టు అవుతుంది. సవాలుకు భయపడితే.. వారి బురద చల్లుడులోనే లోపం ఉన్నట్టు తేలుతుంది. తమ చానల్ ను తమ పార్టీ భట్టాజులు మాత్రం చూస్తే చాలునని.. ఇంకెవ్వరూ ఎప్పటికీ చూడాలనే కోరిక వారికి లేదని అర్ధం చేసుకోవాల్సి వస్తుంది.