చిన్నమ్మ లేఖతో జగన్‌కు అరదండాలేనా?

జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వేల కోట్ల రూపాయల అక్రమార్జనలు, అవినీతికి సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు. సీబీఐ కోర్టులో ఆయన కేసుల పునర్విచారణ మళ్లీ శుక్రవారం నుంచి ప్రారంభం కూడా అయింది. వాటి సంగతి అలా ఉంచితే.. రాష్ట్రంలో ఒక్కచాన్స్ అంటూ దక్కించుకున్న అధికారం- సీబీఐ ఈడీకేసుల కంటె ముందుగానే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపనుందా? ఆయనకు అరదండాలు తప్పవా? భాజపా రాష్ట్ర సారథి, రాజమండ్రి ఎంపీ, అందరూ చిన్నమ్మగా పిలుచుకునే దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం చంద్రబాబునాయుడుకు రాసిన లేఖ పర్యవసానంగా.. జగన్ మీద కఠిన చర్యలు తప్పకపోవచ్చుననే అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది.

పురందేశ్వరి.. సీఎం చంద్రబాబునాయుడుకు మూడు వినతిపత్రాలు సమర్పించారు. మద్యం అలవాటు మానుకోదలచని వారికోసం రాష్ట్రవ్యాప్తంగా రిహాబిలిటేషన్ సెంటర్లు ఉండాలనేది అందులో ఒక అంశం. అలాగే లిక్కర్ తయారీపై నిరంతర తనిఖీలు ఉండాలనేది, నాణ్యతను పరిశీలించాలనేది ఇంకో అంశం. ఇసుక తవ్వకాలు విక్రయాలు అన్నింటినీ క్రమబద్ధీకరించాలనేది మూడో అంశం.

వీటన్నింటికంటె ముఖ్యమైన సంగతి ఏంటంటే.. లిక్కర్ వ్యాపారంలోనూ, ఇసుక విక్రయాల్లోనూ గత అయిదేళ్లలో జరిగిన వ్యవహారాలు అన్నింటిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, అవినీతిని నిగ్గుతేల్చాలని కోరడం. దేశంలో డిజిటల్ లావాదేవీలు ప్రారంభం అయ్యాక.. బహుశా దేశంలోనే కేవలం నగదు రూపంలో జరిగిన వ్యాపారాలు రెండు మాత్రమే! అవి ఏపీలో లిక్కరు, ఇసుక! ఏడాదిగా లిక్కరు వ్యాపారంలో డిజిటల్ ప్రవేశం జరిగినా.. ఇసుక విషయంలో అరాచక దోపిడీ సాగుతోంది. ఈ రెండు వ్యాపారాల ద్వారా.. వైసీపీ నాయకులు, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా కాజేశారని దగ్గుబాటు పురందేశ్వరి తొలినుంచి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ అన్ని వ్యవహారాలపై దర్యాప్తు జరగాలని ఆమె ముఖ్యమంత్రిని కోరుతున్నారు.

అదే జరిగితే.. ఇసుక, లిక్కర్ వ్యాపారాలలో అయిదేళ్ల లావాదేవీలను పరిశీలిస్తే గనుక.. అనేక అక్రమాలు వెలుగులోకి వస్తాయని, జగన్మోహన్ రెడ్డికి, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి వంటి కీలక భాగస్వాములకి కూడా బేడీలు తప్పవని, వారు అందరూ జైళ్లకు వెళ్లాల్సి వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఆ కార్యక్రమానికి, పురందేశ్వరి లేఖ ఆధారంగా విచారణలు సాగించడానికి, చంద్రబాబు ఎప్పుడు ఉపక్రమిస్తారో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories