ఈ ఒక్క ప్రశ్నకు జగన్ జవాబు చెప్పగలరా?

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలను ఏయే అంశాలైనా ప్రభావితం చేస్తుండవచ్చు గాక.. కానీ కడప ఎంపీ బరిలో మాత్రం ఒకే ఒక్క అంశం ఈసారి కీలకం కానున్నది. అదే వివేకానందరెడ్డి హత్య! అయిదేళ్ల కిందట జరిగిన హత్య కేసులో నిందితులు ఎవరో ఇప్పటికీ నిగ్గు తేల్చకపోవడం అనేది ప్రభుత్వాలకు సిగ్గుచేటు వ్యవహారం కావొచ్చు.  కానీ అయిదేళ్ల ముందు జగన్ విజయానికి ఒక రకంగా పరోక్షంగా దోహదం చేసిన చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య, అయిదేళ్ల తర్వాత ఇప్పుడు ఆయన పతనాన్ని నిర్దేశించబోతోంది. కడప ఎంపీ బరిలో పోటీచేస్తున్న ఒక చెల్లెలు షర్మిల, తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడే వరకు విశ్రమించేది లేదని పోరాడుతున్న మరో చెల్లెలు సునీత ఇప్పుడు సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకెళుతున్నారు.

ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాయమాటలను చెల్లెళ్లిద్దరూ పదేపదే నిలదీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా సునీత అడిగిన ఒక్క ప్రశ్న.. ప్రజలను ఆలోచింపజేసేదిగా ఉంది. ‘‘వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే.. దీనిని సహించేవారా? పదవులకోసం తన తమ్ముణ్ని హత్య చేస్తే ఆయన చూసి తట్టుకునేవారా?’’ అని సునీత ప్రశ్నించారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే వైఎస్ రాజశేఖరరెడ్డికి ఒక వర్గం ప్రజల్లో ఉండే అభిమానాన్ని పెట్టుబడిగా వాడుకోవడం ద్వారా మాత్రమే తన రాజకీయ జీవితాన్ని డిజైన్ చేసుకుని, ముఖ్యమంత్రి కూడా అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్.. రాజశేఖర రెడ్డి తమ్ముడిన చంపించిన వారిని ఉపేక్షిస్తున్నారంటే అది ఆయన స్ఫూర్తికి ఎంత పెద్ద ద్రోహమో ప్రజలు ఊహించుకోగలరు. వైఎస్సార్ జీవించి ఉంటే తమ్ముడిని చంపిన వారికి శిక్ష పడడం గురించి పట్టించుకోకుండా ఉండేవారా? అనేది ఇప్పుడు జగన్ సమాధానం చెప్పాల్సిందే.

వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తమ్ముడు వివేకానందరెడ్డి ఎంత అన్యోన్యంగా ఉండేవారో అప్పటి రాజకీయాలతో పరిచయం ఉన్న అందరికీ స్పష్టంగా తెలుసు. వారిద్దరిదీ రామలక్ష్మణుల వంటి బంధం అని, తన తండ్రి, అన్న మాటను జవదాటేవారు కాదని సునీత చెప్పుకొచ్చారు కూడా. వైఎస్సార్ కడప ఎంపీగా బరిలో ఉంటే.. ఆయన తరఫున పులివెందుల ప్రజలకోసం పనిచేయడానికి ఎమ్మెల్యే బరిలో వివేకా పోటీచేసేవారు. అదే వైఎస్ఆర్ పులివెందుల ఎమ్మెల్యేగా పోటీచేస్తే.. కడప ఎంపీగా ఆయన వెళ్లేవారు. వివేకా రాజకీయ జీవితం మొత్తం కూడా వైఎస్ఆర్ ప్రస్థానం కోసమే అన్నట్టుగాను, ఆయనకు అనుగుణంగానూ మాత్రమే ఉండేది.

అలాంటి వివేకానందరెడ్డి.. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం పులివెందుల- కడప స్థానాల మధ్య తమ మధ్య ఉన్న అవగాహన లాంటిదే.. జగన్ – షర్మిల మధ్య ఉండాలని కోరుకున్నారు. జగన్ ఎమ్మెల్యేగాఉంటే, షర్మిల కడప ఎంపీ కావాలని ఆయన కోరుకోవడం అత్యాశ కాదు. కానీ కేవలం అందుకే ఆయనను చంపేశారని, వివేకా హంతకులను ఓడించేందుకే తాను రంగంలోకి  దిగానని అంటూ షర్మిల ఇప్పుడు పోరాడుతున్నారు. సునీత సంధిస్తున్న సూటి ప్రశ్నలకు జవాబు చెప్పకుండా జగన్ ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్లలేరని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories