జగన్మోహన్ రెడ్డికి ఒకప్పట్లో అత్యంత ఆత్మీయులైన, పార్టీలో ఆయనకు సహాయంగా ఉంటూ చక్రం తిప్పిన నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డి ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జగన్ కు బైబై చెప్పేసిన నేపథ్యంలో.. పార్టీ నాయకులు కూడా అనేక చోట్ల బైబై చెప్పి ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్న నేపథ్యంలో మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గుడ్ బై చెప్పడానికి ఫిక్సయ్యారా? అంటే అవుననే సమాధానమే పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒంగోలుకు చెందిన బాలినేని శ్రీనివాస రెడ్డి మొదటిసారిగా ఒంగోలు వెళుతున్నారు.
అయితే ఒంగోలు ప్రజలు తనను ఓడిస్తే ఆ నియోజకవర్గం గురించి ప్రజల గురించి, కార్యకర్తల గురించి పట్టించుకోకుండా ఉండిపోవడం బాలినేనికి కొత్త సంగతి ఎంతమాత్రమూ కాదు. 2014లో ఓడిపోయినప్పుడు ఆయన ఏకంగా నాలుగేళ్లపాటు నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు. కానీ అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఉంది. ఈసారి ఆయన ఏకంగా జగన్ పార్టీకి గుడ్ బై కొట్టేస్తారనే ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది.
ఎన్నికలకు ముందు నుంచి జగన్ తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అలక బాలినేనిలో పుష్కలంగా ఉంది. 2014 ఎన్నికల సమయంలో.. బాలినేని హవా బాగానే నడిచేది. అప్పట్లో జిల్లాకు చెందిన ఎవరు వచ్చినా సరే.. మామయ్య ప్రస్తావన తేకుండా జగన్ మాట్లాడేవాళ్లే కాదు. కానీ.. క్రమంగా హవా తగ్గుతూ వచ్చింది. 2019 ఎన్నికల తర్వాత.. బాలినేని ప్రాభవానికి కోతపడడంతోపాటు, ఆయన వైరం కలిగిఉన్న వైవీ సుబ్బారెడ్డి ప్రాబల్యం పెరిగింది. ఎన్నికలకు ముందు మాగుంటకు ఎంపీటికెట్ ఇవ్వాల్సిందే అని బాలినేని గట్టిగా పట్టుబట్టినా జగన్ పట్టించుకోలేదు. ఆ సమయంలోనే కొడుకుతో సహా పార్టీ వదిలేయాలని అనుకుంటే.. అందరూ కలిసి రాజీ కుదిర్చి పార్టీలో కొనసాగేలా చేశారు. కానీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు.
ఆతర్వాత ఆయన నియోజకవర్గాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే మునిసిపాలిటీలోని కార్పొరేటర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వారంతా దామచర్ల జనార్దన్ తో టచ్ లో ఉంటూ తెలుగుదేశంలో చేరడానికి సిద్ధపడుతున్నారని వినిపిస్తోంది. ప్రకాశం జిల్లా మీద బాలినేని కి ఉన్న పట్టును దెబ్బకొట్టేలా.. జిల్లా పార్టీ సారథ్యం.. ఇప్పుడు ఎంపీగా ఓడిపోయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేతిలో జగన్ పెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. జిల్లాలో సమర్థుడైన నాయకుడు ఒక్కరు కూడా లేరన్నట్టుగా చెవిరెడ్డిని తీసుకురావడం పట్ల పలువురిలో విముఖత ఉంది. అదే జరిగితే గనుక.. బాలినేని పార్టీని వీడడం గ్యారంటీ అని పలువురు పార్టీ వారే అనుకుంటున్నారు.