పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హఠాత్తుగా ఎలాంటి పని, వ్యాపకం లేకుండా పోయింది. ఎన్నికలు జరిగినంత కాలం తెలుగుదేశం పార్టీ వారు అక్రమాలు చేస్తున్నారు, అరాచకాలకు పాల్పడుతున్నారు అంటూ.. పోటీకి దిగకుండా గట్టున కూర్చుని రాళ్లు వేసే బ్యాచ్ చెలరేగి పోతూ వచ్చారు.
ఎన్నికలు ముగిసి తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత కూడా- ఆ విజయం ఒక అబద్ధమని ఈవీఎంలను మానిప్యులేట్ చేయడం ద్వారా గెలిచారని కారు కూతలు కూస్తూ కొన్నాళ్లు వాళ్ళు బతుకీడ్చారు. ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి కూడా వారికి సరైన పాయింట్ ఏమీ దొరకడం లేదు. అలాంటిది పేర్ని నాని ఇప్పుడు ప్రభుత్వమ్మీద విమర్శలు చేయడానికి పూనుకొని- కమెడియన్ లాగా తనను తాను నిరూపించుకుంటున్నారు.
పేర్ని నాని మాటల్లోనే చెప్పాలంటే.. రాష్ట్రంలో ఈ నెల రోజులలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇవ్వడం తప్ప రాష్ట్రం కోసం ఇక చేసింది మీ లేదుట! ఈ మాటలు విని సదరు ‘‘పేర్ని నానికి ఒక కళ్ళజోడు కొనివ్వండ్రా బాబూ’’ అని ఆయన మాటల చాతుర్యం మాత్రం తెలిసిన వారు సెటైర్లు వేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు మొదటి సంతకం పెట్టి ప్రకటించిన మెగా డీఎస్సీ వైసీపీ నాయకులకు కనిపించడం లేదా? అమరావతిని రాజధాని ప్రాంతంగా నోటిఫై చేయడం దగ్గర నుంచి అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధించుకురావడం కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు.
స్థానిక సంస్థలకు దక్కవలసిన డబ్బులన్నీ జగన్ సర్కారు పక్కకు మళ్లించి పథకాలకు ఖర్చు పెట్టేస్తే.. ఇప్పటి సర్కారులోని ఆర్థిక మంత్రి తన తొలిసంతకమే.. 15వ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేయడం మీదనే పెట్టారు. బహుశా అలాంటి పనులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పాపాల్లాగా కనిపిస్తూ ఉండవచ్చు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడాన్ని మించి.. ఈ రాష్ట్ర ప్రజలకు చేయగలిగిన మరో మేలు ఉన్నదా? అని కూడా ప్రశ్నిస్తున్నారు.
అయినా.. పెన్షన్లు తప్ప చంద్రబాబు ఏమీ ఇవ్వడం లేదని అంటున్న పేర్ని నాని.. తమ జగన్ ఏలుబడిలో అయిదేళ్లు పాటూ.. డబ్బులు పంచడం తప్ప.. ప్రభుత్వం చేసిన మరొక్క పని గురించి అయినా చెప్పగలరా? అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.