హీరోయిన్ మాళవికా మోహనన్ కి ‘తంగలాన్’ సినిమాతో మంచి విజయం వరించింది. ప్రస్తుతం ‘రాజా సాబ్’, ‘సర్దార్ 2’ సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రభాస్‌తో నటించడం గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. అంతేకాకుండా ప్రభాస్ పై తనకున్న ఇష్టాన్ని కూడా ఈ ముద్దుగుమ్మ బాహాటంగా చెప్పింది.
ఇంతకీ, మాళవికా మోహనన్ ఏం చెప్పిందంటే.. ‘రాజాసాబ్’తో నేను తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాను. ఇదొక హారర్, రొమాంటిక్ కామెడీ మూవీ. ఆ సినిమా వర్క్‌లో భాగంగా చాలా కాలంగా హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నాను. ఈ ప్రాజెక్ట్ విషయంలో నేనెంతో సంతోషంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది.
మాళవికా మోహనన్ ఇంకా మాట్లాడుతూ.. ‘వ్యక్తిగతంగా ప్రభాస్ తో వర్క్ చేయడం నాకు ఎంతో సరదాగా అనిపించింది. నిజానికి నేను ‘బాహుబలి’ సినిమాకు వీరాభిమానిని. ‘బాహుబలి 1, 2’ చిత్రాలు చూసిన తర్వాత నేను ప్రభాస్‌కు వీరఅభిమానిగా మారిపోయాను. ఆయనతో ఒక్కసారైనా పని చేయాలని కలలు కన్నాను. అలాంటి సమయంలో మొదట నాకు ‘సలార్’ నుంచి నాకు అవకాశం వచ్చింది.
ప్రశాంత్ నీల్ ఒక రోల్ కోసం నన్ను అడిగారు. ఆ క్షణం ప్రభాస్ తో స్క్రీన్ మీద కనపడడమే నాకు గొప్ప అవకాశం అనుకున్నా. కానీ, అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయా. కొన్ని నెలల తర్వాత మారుతి నుంచి ‘రాజాసాబ్’ కోసం మంచి ఆఫర్ వచ్చింది. అప్పుడు నా సంతోషానికి అవధలు లేవు’ అని మాళవికా మోహనన్ వివరించింది.