చిక్కడపల్లి పోలీసులు సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు చేశారు. ఆయన ఇంట్లో ఉండగా అరెస్టు చేసిన పోలీసులు, వైద్యపరీక్షలు కూడా చేయించి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆయన హీరోగా నటించిన పుష్ప 2 చిత్రం విడుదలకు ముందురోజు ప్రీమియర్ షో వేసినప్పుడు.. సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లారు. ఆ సందర్భంగా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించారు. మరో బాలుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో ఆ దుర్ఘటనకు కారణం అయినందుకు అల్లు అర్జున్ అరెస్టు జరిగింది. అయితే.. కేసులు నమోదైన వెంటనే అల్లు అర్జున్ జాగ్రత్త పడి.. ఒక పని చేసి ఉంటే.. ఇప్పుడు పరిస్థితి అరెస్టు దాకా వచ్చేది కాదని పలువురు న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.
4వ తేదీ స్పెషల్ షో సందర్భంగా అల్లు అర్జున్ తన వారితో కలిసి సంధ్య థియేటర్ వద్దకు వెళ్లారు. అక్కడ ఓపెన్ టాప్ వాహనంలో.. అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లడంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు శ్రీతేజ గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో థియేటర్ కు వస్తున్నప్పుడు.. భద్రత పరంగా సరైన చర్యలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు. ముగ్గురి అరెస్టులు కూడా జరిగాయి.
మరోవైపు అల్లు అర్జున్ తనమీద చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. గతంలో ఎన్నికల సమయంలో నంద్యాలకు వెళ్లినప్పుడు.. ఆయన మీద ఇదేమాదిరిగా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనమీద కేసు నమోదు అయింది. అప్పట్లో ఆ కేసు కొట్టేయాలంటూ.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేసు కూడా చిన్నదే కావడం వలన హైకోర్టు సానుకూలంగా స్పందించి కేసు కొట్టేసింది.
సంధ్య థియేటర్ సంఘటనలో ఏకంగా ఒక ప్రాణం పోయింది. ఇలాంటి సందర్భంలో కూడా అల్లు అర్జున్ చాలా తేలిగ్గా.. ఆ కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అసలే ఆయన మీద నాన్ బెయిలబుల్ సెక్షను కింద కూడా కేసు నమోదు అయి ఉంది.ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి స్టేషనుకు తరలించడం సంచలనాంశంగా మారింది.