రాష్ట్రవిభజన జరిగిన నాటికి ఆంధ్రప్రదేశ్ కు దక్కిన వరాలు మూడు! పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వేజోన్, కొత్త రాజధానికి సహకారం. చంద్రబాబునాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఈ మూడు పనులను ఒక దశ వరకు తీసుకువెళ్లారు. తర్వాత ఒక్కచాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ మూడింటిని కూడా పడుకోబెట్టేశారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ఆయన ద్రోహాన్ని గుర్తించిన జనం దారుణంగా ఓడించిన తరువాత, మళ్లీ అధికారంలోకివచ్చిన చంద్రబాబునాయుడు ఈ మూడు ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నారు. అధికారంలోకి వచ్చి అయిదునెలలే అయింది. వచ్చే ఏడాది ప్రారంభం అయ్యేసరికి పోలవరం, అమరావతి, రైల్వేజోన్ పనులన్నీ ప్రారంభమైపోయి ఉంటాయి. ఇప్పటికే అన్ని పనులకు డెడ్ లైన్లు పెట్టుకుని ముందుకు వెళుతున్నారు. ఈ వేగం వైసీపీ వారికి మింగుడుపడుతున్నట్టు లేదు. ప్రధానంగా ఈ మూడూ గనుక.. రాబోయే అయిదేళ్లలో పూర్తయితే.. తమ పార్టీకి రాష్ట్రంలో ఇక పుట్టగతులు ఉండవని వారు భయపడుతున్నారు. ఈ మూడు ప్రాజెక్టుల మీద కూడా పసలేని విమర్శలు చేసి ఏదో ఒక రచ్చ చేయాలని తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు గురించి చేస్తున్న విమర్శలను గమనిస్తే అదే అనిపిస్తోంది.
వైసీపీ తరఫున నీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు ఇద్దరూ ఈ విషయంలో సైలెంట్ గానే ఉన్నారు. 2020 నాటికి పోలవరం పూర్తయిపోతుందని ప్రగల్భాలు పలికిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్, పోలవరం ప్రాజెక్టు ఏమిటో తనకు అర్థమే కాలేదని పలికిన మంత్రి అంబటి రాంబాబు. వీళ్లిద్దరూ సైలెంట్ గా ఉండగా.. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అదికూడా హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టి.. పోలవరం గురించి తనకు తోచినదెల్లా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారట. కేంద్రం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూంటే రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదుట. జగన్ ప్రభుత్వ హయాంలోనే ఎత్తు తగ్గించారని చెబుతున్నారట… ఇవీ బుగ్గన ఆరోపణలు.
నిజానికి ఈ వివాదం చాలా కాలం నుంచి వైసీపీ వారు మాత్రమే లేవెనెత్తుతున్నారు. వారి పత్రికలో మాత్రమే ఎత్తు తగ్గించినట్టుగా కథనాలు వస్తున్నాయి. వాటిని పట్టుకుని అందరూ మాట్లాడుతున్నారు. బుగ్గన కాస్త ఆలస్యంగా పేపరు చూసినట్టుంది. ఇవాళ మాట్లాడుతున్నారు. వాటికి కౌంటరుగా.. ఎత్తు తగ్గించినట్టుగా ఒక్క ఆధారమైనా చూపించాలని నీటిపారుదల మంత్రి నిమ్మల రామానాయుడు సవాలు విసిరితే వైసీపీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. ఆధారాలు చూపించలేరు.. కానీ ఆరోపణలు మాత్రం చేస్తుంటారు. ఇదంతా వైసీపీ అనుసరిస్తున్న చవకబారు ఎత్తుగడలు అని ప్రజలు అనుకుంటున్నారు.