వాలంటీర్లకు లంచాలు.. వారిద్వారానే కుట్రలు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహుముఖ వ్యూహంతో ఈ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలని చూస్తోంది. ఏ పార్టీ అయినా సరే.. గెలుపుకోసం ఎన్ని వ్యూహాలను అనుసరించినా తప్పులేదు. కానీ వైసీపీ వారు ఫాలో అవుతున్న వ్యూహాలన్నీ కూడా కుట్రపూరితమైనవి, నేరపూరితమైనవి, వక్ర ఆలోచనలతో కూడినవి కావడం విశేషం. వైసీపీ వారు ఇప్పటికే ఎన్నికల పోలింగ్ రోజున అల్లర్లు సృష్టించడం ద్వారా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారానూ, పోలింగ్ ముందురోజు డబ్బు లిక్కర్ పంపిణీ ద్వారానూ గెలవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో.. వాలంటీర్లను మేగ్జిమమ్ వాడుకోవడం ద్వారా కూడా ఎన్నికల్లో నెగ్గాలని వారు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగినట్లుగా వైసీపీ నాయకులు, అభ్యర్థులు వాలంటీర్లతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారికి తాయిలాలు ప్రకటిస్తున్నారు. లంచాలు, కానుకలు ఇస్తున్నారు. ఎన్నికల్లో సహకరించాలని, గెలిచిన తర్వాత మీకు మరిన్ని తాయిలాలు ఉంటాయని వారిని ఊరిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థను అడ్డగోలుగా ఎన్నికల కోసం వాడుకోవడం అనే దుర్మారన్గం విచ్చలవిడిగా మారుతోంది.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల అరాచకాలకు పాల్పడుతూ వస్తున్నదో అనేక విమర్శలున్నాయి. రాష్ట్రంలోని ప్రజలందరి వ్యక్తిగత డేటాను సేకరించడం ద్వారా.. ప్రజల ప్రైవసీకి భద్రత లేకుండా ప్రభుత్వం అరాచకం సృష్టిస్తున్నదని, అందులో వాలంటీర్లు భాగస్వాములు అవుతున్నారని పవన్ కల్యాణ్ చాలాకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, ముఖ్యమంత్రితో సహా వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించిన ప్రతి సందర్భంలోనూ.. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించడం గురించి వారంతా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని, జగన్ మళ్లీ గెలవకపోతే పెన్షన్లు అందని, పథకాలు అన్నీ ఆగిపోతాయని ప్రచారం చేయాలంటూ ఊదరగొడుతూనే ఉన్నారు.

ఎన్నికల సీజను వచ్చేసిన తర్వాత వాలంటీర్లతో నాయకుల భేటీలు ఇంకా జోరందుకున్నాయి. రూపు మార్చుకున్నాయి. ఇప్పుడు వాలంటీర్లను ప్రలోభపెట్టడం ద్వారా తమకు అనుకూలంగా ఇంటింటికీ తిప్పి, ఓట్లు వేయించేలా ప్రచారం చేయించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం వాలంటీర్లకు ప్రతిచోటా వైసీపీ అభ్యర్థులు నగదు లంచాలు ఇస్తున్నారు. ఒక్కొక్క వాలంటీరుకు పదివేల వంతున లంచమిచ్చి  వారిని ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేయాల్సిందిగా చెబుతున్నారు. వారికి సెల్ ఫోన్లు వంటి ఖరీదైన కానుకలు కూడా ఇస్తున్నారు.

ఇవంతా ఒక ఎత్తు అయితే.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి వాలంటీర్లతో మీటింగు పెట్టుకుని వారందరికీ తలా పదివేలు కానుకలుగా ఇచ్చి మరో పనిని కూడా అప్పజెప్పారు. వాలంటీర్లకు జగన్ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని.. అవసరమైతే ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు పంపిణీ కూడా చేయాల్సి ఉంటుందని పురమాయించారు. ఓట్ల కొనుగోలుకు వైసీపీ నాయకులు ఇంత బరితెగించి వ్యవహరిస్తుండడం, అందుకు వాలంటీర్లను వాడుకోవడం వివాదాస్పదం అవుతోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories