వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన కోసం, తన కూతుళ్లు ఇద్దరికోసం, నివాస భవంతుల కోసం సర్కారు వారి సొమ్ముతో ప్యాలెస్ లు కట్టించుకున్నారు. 430 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసి జగన్ నిర్మించిన ఈ ప్యాలెస్ లను ఏ రకంగా వాడుకుంటే నష్టం రాకుండా ఉంటుందో అర్థం కాక.. ప్రభుత్వం తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఇలాంటి స్థితిలో.. రుషికొండ భవనాలను ఏ రకంగా వాడుకోవాలనే విషయంలో చాలా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఏ సంగతీ తేల్చడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశారు.. చంద్రబాబునాయుడు. అనేక సలహాలు వస్తుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రుషికొండ భవనాలను వినియోగించుకోవడం గురించి ప్రభుత్వానికి ఒక ఉచిత సలహా ఇస్తున్నారు. అయితే ఆ సలహా కూడా ఏదో అవకతవకగా ఉందని ప్రజలు అంటున్నారు.
నిజానికి ఈ సలహా కూడా బొత్స సత్యనారాయణ స్వబుద్ధితో ఇచ్చినది కాదు. గోవా గవర్నరు అశోక్ గజపతి రావుకు కౌంటర్ ఇవ్వాలనే అత్యుత్సాహంతో.. రెచ్చిపోయి ఇచ్చిన వ్యాఖ్య ఇప్పుడు తుస్సుమంటోంది. జగన్ చేసిన ద్రోహాన్ని బయటపెడుతోంది. ప్రభుత్వ ఖజానాకు జగన్ ఎంత నష్టం చేశారో.. బొత్స మాటలనే కాస్త లోతుగా గమనిస్తే అర్థమవుతుంది.
గోవా గవర్నరు అశోక్ గజపతి రాజు విశాఖపట్నంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రుషికొండ కు గుండుకొట్టించి నిర్మించిన భవంతులను మెంటల్ హాస్పిటల్ కు కేటాయించాలని సూచించారు. ఆ మాట చెప్పేసరికి, బొత్సకు రోషం పొడుచుకొచ్చినట్టుంది. లేదా, జగనన్న 2.0 వస్తే.. జగన్ అక్కడే నివాసం ఉంటాడు గనుక కోపం కూడా వచ్చి ఉండొచ్చు. అందుకని కౌంటర్లు ఇచ్చారు.
రుషికొండ ప్యాలెస్ లను డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు కేటాయిస్తే.. ఏడాదికి 70 కోట్ల దాకా ఆదాయం వస్తుంది కదా అని బొత్స సత్యనారాయణ అంటున్నారు. అంత ఆదాయం రావడం అంటే.. ప్రభుత్వ ఖజానికి నష్టం చేకూరుస్తున్నట్టే. ఎందుకంటే.. ఈ భవంతులు నిర్మించడానికి పూర్వం.. అదే స్థలంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో అతిథిభవనాలు ఉండేవి. వాటి అద్దెల రూపేణా ఏడాదికి 70 కోట్ల దాకా టూరిజం వారికి ఆదాయం వచ్చేది. ఆ అతిథి భవనాలన్నింటినీ కూలగొట్టించి.. విధ్వంసక ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి.. తనకు, తన కుమార్తెలకు ప్యాలెస్ లు కట్టించుకున్నారు. వాటిని డెస్టినేషన్ వెడ్డింగులకు ఇస్తే 70 కోట్లు ఏడాదికి వస్తాయని బొత్స అంటున్నారు. అప్పుడూ 70, ఇప్పుడూ 70 కోట్లే అయితే.. ఇక మధ్యలో 430 కోట్లు తగలేసింది ఎందుకు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బొత్స మాటల వల్ల.. అచ్చంగా ఖజానాకు జగన్ చేసిన నష్టం ఏమిటో ప్రజలకు అర్థమవుతోంది!