బొత్స : చిల్లర నాటకాల ఉక్కు ప్రేమ!

మంత్రి బొత్స సత్యనారాయణకు హఠాత్తుగా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మీద ప్రేమ పుట్టుకు వచ్చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రెవేటీకరించడానికి కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రయత్నిస్తున్నదనే సంగతి కూడా గుర్తుకు వచ్చింది. అందుకోసం ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రెవటీకరణ జరగకుండా అడ్డుకోవాలని, ఎన్నికల ప్రచారానికి గాజువాకకు వస్తున్న చంద్రబాబునాయుడును  బతిమాలుతున్నారు. ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా స్పష్టమైన విధానాన్ని ప్రకటించి అక్కడి ఉద్యోగులకు ఊరట కలిగించాలనేది బొత్స సత్యనారాయణ డిమాండ్.

ఇన్నాళ్లూ బొత్స సత్యనారాయణ ప్రభుత్వంలోనే కీలకమంత్రిగా ఉన్నారు కదా. ఉక్కు పరిశ్రమపై ఆయనలోని ప్రేమ ఇన్నాళ్లూ ఏమైపోయింది? తమ ముఖ్యమంత్రి జగన్ ద్వారా ఆ పనిని చక్కబెట్టలేకపోయారా? అనే ప్రశ్న ప్రజలనుంచి వస్తుందని ఎంతో అనుభవజ్ఞుడు అయిన బొత్సకు స్పష్టంగానే తెలుసు. అందుకే ముందుగా తానే చెప్పేశారు. సీఎం జగన్.. ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికి లేఖ రాశారని అంటున్నారు.

అయితే బొత్సలో ఇప్పుడు హఠాత్తుగా ఈ ఉక్కు ప్రేమ ఎందుకు పొంగిందనేదే డౌటు. ఆయన భార్య ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీచేస్తుండేసరికి.. ఆమెకు లాభం చేకూర్చడానికి ఆయన స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మీద కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు గాజువాకకు వస్తోంటే.. ఇలాంటి డిమాండ్ వినిపిస్తున్న బొత్స జగన్ ఏలుబడిలో ఎన్నడూ స్టీల్ ప్లాంట్ కష్టాలను పట్టించుకోలేదు. ప్రజలు నవ్వుతారనే ఆలోచన కూడా లేకుండా జగన్ లేఖ రాశారని చెబుతున్న ఆయనకు తెలుగుదేశం వారు మాత్రం.. మీ జగన్ కు ఎటూ చేతకాలేదు. మీరంతా కలిసి చంద్రబాబును గెలిపించండి. అప్పుడు ఆయన కూడా సీఎం హోదాలో మళ్లీ ప్రధానికి ఒక లేఖ రాస్తారు అని కౌంటర్లు వేస్తున్నారు.

జగన్ సీఎంగా ఉండగా ఏ ఒక్క రోజు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు తన మద్దతు ప్రకటించలేదు. వారి కష్టాలను ఆలకించలేదు. ప్రెవేటీకరణ వద్దని మోడీ వద్దకు రెప్రజెంట్ చేయలేదు. రాజకీయంగా తన మీద నిందపడకుండా ఉండేందుకు ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబునాయుడు బిజెపి పొత్తులు పెట్టుకునే సరికి.. ఇన్నాళ్లూ అసలు పట్టించుకోని బొత్స వంటి వారికి కూడా ప్రేమ పుట్టుకొచ్చింది. చంద్రబాబును నిలదీస్తే గాజువాక ప్రజలంతా ఎగబడి తన భార్య ఝాన్సీకి ఓట్లు వేసి ఎంపీగా గెలిపించేస్తారని ఆయన ఊహిస్తున్నారేమో మరి!

Related Posts

Comments

spot_img

Recent Stories