గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్- జీవీఎంసీలో స్థాయీ సంఘం ఎన్నికలు జరిగిన తీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద షాక్ అనే చెప్పాలి. కొందరు కార్పొరేటర్లు అధికార కూటమి పార్టీల్లోకి ఫిరాయించినా సరే.. గెలుపు తమదే అవుతుందని నమ్మకంగా ఉన్న పార్టీకి ఈ దెబ్బ తట్టుకోలేనిది. అసలే ఓటమిభారంతో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఈ జీవీఎంసీ ఎన్నికలు మరింత అసహనానికి గురిచేసేవే అని చెప్పాలి. అయితే.. ఈ ఎన్నికల ప్రభావం పార్టీ మీద ఎలా ఉన్నదంటే.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా పార్టీ తరఫున పోటీచేస్తున్న బొత్స సత్యనారాయణ ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బొత్స కుటుంబంలో నలుగురికి జగన్మోహన్ రెడ్డి టికెట్లు కేటాయించారు. బొత్స దంపతులు ఇద్దరూ పోటీచేశారు. ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా, భార్య ఝాన్సీ విశాఖ ఎంపీగా బరిలోకి దిగారు. మొత్తం బొత్స కుటుంబం ఖాతాలో రెండొందల కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేసి ఉంటారనే పుకార్లు స్థానికంగా ఉన్నాయి. ఇంత చేసినా.. నలుగురిలో ఒక్కరు కూడా గెలవలేదు. ఆ భారం నుంచి, పరాభవం నుంచి వారు ఇంకా కోలుకోనే లేదు. ఇలాంటి సమయంలో బొత్స సత్యనారాయణను జగన్ ఎమ్మెల్సీ బరిలోకి దించారు.
ఈ ఎన్నికలో ఉండే ఓట్లు 841 మాత్రమే. అన్ని ఓట్లనూ కొనవలసిన అవసరం లేదు. తమ పార్టీకి చెందిన (అలా అనుకుంటున్న) 600పైచిలుకు ఓట్లను నికరంగా తనకు వేయించుకోగలిగితే చాలు. కానీ ఈ ఓట్ల విలువ ఎమ్మెల్యే ఎన్నికల్లో 3 నుంచి 5 వేల ధర పలికేవి కాదు. లక్షల్లో ధర పలికే ఓట్లు! ఇంత చేసినా అందరూ ఓటు వేసి తీరుతారనే గ్యారంటీ లేదు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సందేహంగానే ఉంది. జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమి మొత్తం పది సీట్లనూ గెలుచుకోవడం అందుకు నిదర్శనం. ఆ ఫలితాలు చూసిన తర్వాత.. ఇతర ప్రాంతాల్లో ఉండే స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా నికరంగా తమ పార్టీకి కట్టుబడి ఉంటారనే నమ్మకం బొత్సలో సన్నగిల్లినట్టుగా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికకు డబ్బు ఖర్చు పెట్టేప్పుడు ఆచితూచి వ్యవహరించాలని ఆయన అలర్ట్ అవుతున్నారుట. ఇన్ని కష్టాలు పడినా.. బొత్స నెగ్గుతారో లేదో అనే అనుమానాలు ఆయన అనుచరుల్లోనే వ్యక్తం అవుతున్నాయి.